Pakistan: ఇస్లామాబాద్ లో హిందూ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం.. భారీ నిధులు విడుదల చేసిన పాక్ ప్రభుత్వం!

  • ఇస్లామాబాదులో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం
  • 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయం
  • రూ. 10 కోట్లు విడుదల చేసిన పాక్ ప్రభుత్వం
Pakistan releases Rs 10 cr for Sri Krishna temple construction

మైనార్టీలపై తీవ్ర స్థాయిలో వివక్ష చూపించే పాకిస్థాన్... ఎట్టకేలకు ఓ మంచి పనికి ఉపక్రమించింది. ఇస్లామాబాదులో  శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణానికి రూ. 10 కోట్లు విడుదల చేసింది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా పాక్ మానవహక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మాట్లాడుతూ, ఇస్లామాబాదులో హిందువుల జనాభా క్రమంగా పెరుగుతోందని... దేవాలయాలకు వెళ్లేందుకు హిందువులు ఎక్కడెక్కడకో వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. అందుకే ఇస్లామాబాదులో ఆలయాన్ని నిర్మించబోతున్నట్టు చెప్పారు. 2017లో ఇస్లామాబాదులోని హిందూ పంచాయతీకి సీడీఏ స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. తాజాగా ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం... రూ. 10 కోట్లను విడుదల చేసిందని చెబుతూ, ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి గత బుధవారం భూమి పూజను కూడా పూర్తిచేశారు.

మరోవైపు, పేదరికంలో మగ్గుతున్న పాకిస్థాన్ ను కరోనా వైరస్ మరింతగా దిగజార్చింది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా హిందూ దేవాలయానికి ఆ దేశం నిధులు మంజూరు చేయడం గమనార్హం.

More Telugu News