Kinjarapu Acchamnaidu: రాత్రికి రాత్రి మారిపోయిన సీన్... అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయించే ప్రయత్నం!

  • ఈఎస్ఐ స్కామ్ లో అవకతవకల అభియోగాలు
  • మూడు రోజులు విచారించేందుకు అనుమతి
  • ప్రస్తుతానికి డిశ్చార్జ్ చేయబోమన్న వైద్యులు
High Drama Over Acchammnaidu Custody

ఈఎస్ఐ స్కామ్ లో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలపై గత వారంలో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడి విషయంలో నిన్న రాత్రి హైడ్రామా జరిగింది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన్ను అవినీతి నిరోధక శాఖ అధికారుల కస్టడీకి ఇస్తూ, విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఓ డాక్టర్, ఆయన న్యాయవాది సమక్షంలో అధికారులు ఆయన్ను ప్రశ్నించవచ్చని, అచ్చెన్నాయుడు మంచంపైనే ఉండి సమాధానాలు ఇవ్వవచ్చని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా, ఈ ఉత్తర్వులు వెలువడగానే, అచ్చెన్నాయుడిని గురువారం డిశ్చార్జ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపించారు. రాత్రికి రాత్రే పరిస్థితి మారిపోయిందని, వెంటనే అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి పంపాలన్న ఒత్తిడి ఆసుపత్రి డాక్టర్లపై పెరిగిందని వారు వెల్లడించారు. అంతకుముందు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఇతర పోలీసు అధికారులతో కలిసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం గమనార్హం. అర్థరాత్రి డిశ్చార్జ్ పత్రాన్ని ఎలా ఇస్తారని, అచ్చెన్నాయుడి తరఫు న్యాయవాదులు ప్రశ్నించగా, ఈ విషయంలో తుది నిర్ణయాన్ని ఉన్నతాధికారులు తీసుకుంటారన్న సమాధానం వచ్చిందని వారు తెలిపారు.

ఇదిలావుండగా, తనను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలన్న అచ్చెన్నాయుడి అభ్యర్థనను అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు ఏడో అడిషనల్ జడ్జ్ తిరస్కరించారు. మరోవైపు ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ ను మూడు రోజుల కస్టడీకి ఇస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ వి.జనార్దన్, ఎంకేపీ చక్రవర్తి, జి.వెంకట సుబ్బారావులను రెండు రోజుల కస్టడీకి ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

గత రాత్రి జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ఉదయం కూడా గుంటూరు జీజీహెచ్ వద్ద హై డ్రామా నెలకొంది. అచ్చెన్నాయుడిని తామేమీ డిశ్చార్జ్ చేయడం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. మరికాసేపట్లో ఆయన్ను ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు ఆసుపత్రికి రానుండగా, ఇప్పటికే అచ్చెన్నాయుడి తరఫు లాయర్ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు.

More Telugu News