చనిపోతున్నానంటూ ప్రేయసికి టిక్ టాక్... ఆపై ఉరేసుకున్న కామారెడ్డి యువకుడు!

  • హైదరాబాద్ లో ప్రేమలో పడ్డ సంతోష్
  • విషయం తెలిసి అమ్మాయిని పంపించేసిన తల్లిదండ్రులు
  • మనస్తాపంతో ఆత్మహత్య
Lover send Tiktok Video before Sucide

తన ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో, ప్రియురాలికి టిక్ టాక్ వీడియో పెట్టి, ఆపై పది నిమిషాల వ్యవధిలోనే ఫ్యాన్ కు ఉరేసుకుని యువకుడు మరణించిన ఘటన కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీలో కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తిమ్మక్ పల్లికి చెందిన గుర్రాల సాయవ్వ, నారాయణ దంపతులు కొన్నాళ్ల క్రితం కామారెడ్డికి వచ్చారు. ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక నారాయణ కొన్నేళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకోగా, సాయవ్వ బీడీలు చుడుతూ తన ముగ్గురు పిల్లలనూ సాకింది. చిన్న కుమారుడు సంతోష్ (22), తన ఇద్దరు అన్నలతో కలిసి హైదరాబాద్ లో పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు.

డ్రైవింగ్ చేసే సంతోష్ హైదరాబాదులో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సంతోష్ ను మందలించి, తమ బిడ్డను వరంగల్ కు తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి కుంగిపోయిన సంతోష్, తన ప్రియురాలికి ఫోన్ చేస్తూ, కొంతకాలం తన బాధను పంచుకున్నాడు. ఇక నీ ఎడబాటును భరించలేనంటూ టిక్ టాక్ వీడియో చేసి, ఆమెకు పంపి, ఆపై ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. 

More Telugu News