Police: కరోనా సోకిందని తెలియగానే మినీ బస్సులోనే ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

Karnataka state reserve police head constable commits suicide due to corona scare
  • కర్ణాటకలో ఘటన
  • ఆసుపత్రికి వెళ్లేలోపే లుంగీతో ఉరేసుకున్న రిజర్వ్ పోలీసు
  • కరోనాకు భయపడవద్దన్న అడిషనల్ డీజీపీ
కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రిజర్వ్ పోలీసు విభాగానికి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దాంతో అతడిని బెంగళూరులోని సీవీ రామన్ ఆసుపత్రికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యేకంగా ఓ మినీ బస్సు ఏర్పాటు చేశారు.

కానీ ఆ బస్సు ఆసుపత్రికి చేరేలోపే ఆ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి చేరుకున్న అనంతరం బస్సు డోర్ తీయగా, ఆయన తన లుంగీతో బస్సు గ్రిల్ కు ఉరేసుకుని కనిపించాడు. కరోనా పాజిటివ్ గా వచ్చిందన్న భయంతోనే ఆ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం చెందినట్టు భావిస్తున్నారు. కరోనా పాజిటివ్ గా వచ్చినంత మాత్రాన భయపడాల్సిందేమీ లేదని, దానిపై విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంటే తప్పకుండా కోలుకుంటారని కర్ణాటక రాష్ట్ర రిజర్వ్ పోలీస్ విభాగం అడిషనల్ డీజీపీ అలోక్ కుమార్ స్పష్టం చేశారు.
Police
Head Constable
Suicide
Corona Virus
Karnataka

More Telugu News