Jadcherla: కాంగ్రెస్ నేత రాంచంద్రారెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్!

Another twist in Jadcherla Congress leader Ramchandra reddy
  • మృతదేహాన్ని కారులో పెట్టుకుని వంద కిలోమీటర్ల ప్రయాణం
  • చర్చలకు పిలిచి కత్తెర, కొడవలితో హత్య
  • ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నందుకు కక్ష
జడ్చర్ల కాంగ్రెస్ సీనియర్ నేత రాంచంద్రారెడ్డి హత్య కేసులో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. రాంచంద్రారెడ్డిని హత్య చేసిన ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డి అతడి మృతదేహంతో కారులో ఏకంగా వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. చివరికి ఏం చేయాలో పాలుపోక కారులో అతడి మృతదేహాన్ని పెంజర్లలో వదిలి పరారయ్యాడు.

పోలీసుల కథనం ప్రకారం.. రాంచంద్రారెడ్డి, ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డి మధ్య భూవివాదం నెలకొంది.
పెద్దల సమక్షంలో కుదిరిన ఒప్పందంలో భాగంగా తనకు 5 ఎకరాలు ఇవ్వాలని ప్రతాప్ రెడ్డి కోరాడు. అందుకు అంగీకరించిన రాంచంద్రారెడ్డి భూమికి బదులుగా రూ.2.75 కోట్లు ఇస్తానని చెప్పి దస్తావేజులు, కోర్టు కాపీలు తీసుకున్నారు. అయితే, ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో ప్రతాప్‌రెడ్డి తీవ్ర అసహనానికి లోనయ్యాడు. మరోవైపు తీసుకున్న అప్పుల ఒత్తిడి పెరిగింది.

ఇదిలావుండగా, ఆ వివాదాస్పద భూమిలో ప్రతాప్ రెడ్డి తన తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా రాంచంద్రారెడ్డి అడ్డుకున్నాడు. దీంతో అతడిపై పగ పెంచుకున్న ప్రతాప్‌రెడ్డి అడ్డుతొలగించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా రాంచంద్రారెడ్డిని చర్చలకు పిలిచి షాద్‌నగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో వెంట తెచ్చుకున్న కత్తెర, కొడవలితో అతడి పొట్ట, మెడపై పలుమార్లు పొడిచాడు. ఆ సమయంలో డ్రైవర్ విజయ్ వాహనం నడుపుతున్నాడు.

షాద్‌నగర్ సమీపానికి వచ్చేసరికి ప్రతాప్‌రెడ్డి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని కారులోనే ఉంచుకుని కేశంపేట, కడ్తాల్ తదితర ప్రాంతాల మీదుగా దాదాపు వంద కిలోమీటర్లు తిప్పాడు.  చివరికి కొత్తూరు మండలంలోని పెంజర్లలో వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రతాప్‌రెడ్డితోపాటు డ్రైవర్ విజయ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
Jadcherla
Congress
Ramchandra reddy
Pratap reddy
Crime News

More Telugu News