Cherukuvada Sriranganadha Raju: రఘురామకృష్ణంరాజు మా ఎంపీ... ఎప్పుడు వచ్చినా భద్రత కల్పిస్తాం: మంత్రి శ్రీరంగనాథరాజు

Sri Ranganatha Raju responds to MP Raghurama Krishnamraju comments
  • ప్రోటోకాల్ ప్రకారం సహకరిస్తామన్న మంత్రి
  • ఏపీలో ఎవరికి భద్రత కావాలన్నా ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడి
  • ఇదేమీ ఫ్యాక్షన్ ఏరియా కాదని వివరణ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వస్తోన్న విషయం తెలిసిందే. తన పార్లమెంటు స్థానం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలతో రఘురామకృష్ణంరాజు సంబంధాలు దెబ్బతిన్నట్టు ఆయన తాజా వ్యాఖ్యలు చెబుతున్నాయి. తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. దీనిపై మంత్రి శ్రీరంగనాథరాజు స్పందించారు. ఏపీలో ఎవరికి భద్రత కావాలన్నా తమ ప్రభుత్వం కల్పిస్తుందని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం సహకారం అందజేస్తామని తెలిపారు.

15 లక్షల మంది ప్రజలకు ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా తగిన భద్రత ఏర్పాటు చేస్తామని, గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. ప్రాణహాని ఉందంటున్న ఎంపీ, ఇదేమీ ఫ్యాక్షన్ ఏరియా కాదన్న విషయం గుర్తించాలని అన్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గం కూడా నరసాపురం ఎంపీ స్థానం పరిధిలోనిదే. ఇటీవల రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానిస్తూ,  మంత్రి శ్రీరంగనాథరాజు, ఆయన కుమారుడు పెద్ద దొంగలు అంటూ ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు.
Cherukuvada Sriranganadha Raju
Raghurama Krishnamraju
MP
Narasapur
YSRCP
Andhra Pradesh

More Telugu News