అమరవీరులకు భారత్ ఘనంగా వీడ్కోలు పలికింది... మీరేం చేశారు?: చైనా తీరుపై సొంత ప్రజల్లో అసంతృప్తి

22-06-2020 Mon 15:19
  • గాల్వన్ లోయలో ఘర్షణలు
  • 20 మంది భారత సైనికుల మృతి
  • చైనా వైపునా భారీ ప్రాణనష్టం!
  • అధికారికంగా వెల్లడించని చైనా
China netizens questions their leadership on casualties
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, వారికి పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కానీ చైనాలో పరిస్థితి మరోలా ఉంది. సరిహద్దు ఘర్షణల్లో తమ సైనికులు ఎంతమంది చనిపోయారో చైనా ఇప్పటికీ బయటపెట్టడంలేదు. దాంతో అక్కడి ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది.

చైనా నెటిజన్లు భారత్ లో అమరవీరులకు ఘనంగా జరిగిన అంతిమయాత్రలు, వీరమరణం పొందిన సైనికుల ఫొటోలను తమ 'వీబో' సోషల్ మీడియా సైట్లో పోస్టు చేస్తున్నారు. తమ సైనికులు కూడా ఎంతమంది చనిపోయారో చైనా ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంలో భారత్ ఎంతో గొప్పగా వ్యవహరిస్తోందంటూ ప్రశంసిస్తున్నారు.

"ప్రాణత్యాగం చేసిన తమ సైనికులకు భారత్ మహోన్నతమైన రీతిలో సంస్మరణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. దేశాన్ని రక్షించే సైనికుల పట్ల భారత్ అధినాయకత్వం, అక్కడి ప్రజలకు ఎంత గౌరవం ఉందో ఈ చర్యలు చాటిచెబుతున్నాయి. భారతదేశ ప్రజల ఐక్యతకు ఇదే నిదర్శనం. సైనికులను ఎలా గౌరవించాలో భారత్ నుంచి మనం నేర్చుకోవాలి. మనమెందుకు సైనికుల అంత్యక్రియలను బహిరంగంగా నిర్వహించుకోలేకపోతున్నాం?" అంటూ అక్కడి నెటిజన్లు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు.