Cyber Crime: రూ.4,500 ఫోన్ బుక్ చేస్తే రూ.80 వేలు పోయాయి!

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
  • సైబర్ నేరగాళ్ల విజృంభణ
  • మూడు విడతల్లో డబ్బు కొట్టేసిన వైనం!
Cyber criminals cheated young man

ఆన్ లైన్ లావాదేవీలు ఒక్కోసారి ఎంత ప్రమాదకరమో తెలిపే సంఘటన ఇది. రూ.4,500 విలువైన ఫోన్ బుక్ చేసి ఓ కుర్రాడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.80 వేలు పొగొట్టుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నిషాంత్ ఈజీ ఫోన్ యాప్ లో ఓ మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. దాని విలువ రూ.4,500 మాత్రమే. అయితే తాను బుక్ చేసిన వారం రోజులకు కూడా ఫోన్ చేతికి అందకపోవడంతో నిషాంత్ ఆ యాప్ కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేశాడు. దాంతో, అవతలి వ్యక్తులు నిషాంత్ ను బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని కోరారు. బ్యాంకు ఖాతా వివరాలు ఉంటేనే డబ్బు వాపస్ ఇవ్వడానికి కుదురుతుందని చెప్పారు.

అది నిజమే అని నమ్మిన నిషాంత్ తన తండ్రి లఖావత్ మోయీలాల్ పేరిట ఉన్న ఆంధ్రాబ్యాంకు ఖాతా వివరాలు వారికి తెలిపాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ ఖాతాలోంచి రూ.80 వేలు గల్లంతయ్యాయి. మొదట రూ.20 వేలు, రెండోసారి మరో రూ.20 వేలు, చివరగా రూ.40 వేలు మాయమయ్యాయి.ఈ విషయం తెలిసిన నిషాంత్ తండ్రి వెంటనే ఖాతాను బ్లాక్ చేయించడంతో ఖాతాలో మిగిలిన డబ్బులు నిలిచాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News