Asaduddin Owaisi: ప్రధానమంత్రి కార్యాలయంపై ప్రశ్నల వర్షం కురిపించిన అసదుద్దీన్ ఒవైసీ

  • గాల్వన్ లోయలో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణ
  • అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ
  • పీఎంవో తీరు అయోమయం కలిగిస్తోందన్న ఒవైసీ
Asaduddin Owaisi questions PMO over China issue

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చైనా ఎలాంటి దురాక్రమణ జరపలేదని అన్నారు. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. చైనా ఎలాంటి దురాక్రమణ జరపకపోతే ఇంతమంది సైనికులు ఎందుకు చనిపోయినట్టని నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయంలో ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి కార్యాలయంపై విమర్శలు గుప్పించారు.

"మన భూభాగంలో చైనా చొరబడలేదని ప్రధానమంత్రి కార్యాలయం చెబుతోంది. ఈ క్రమంలో కొంత అయోమయం కలుగుతోందని, అందుకే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

  • చైనా బలగాలను మన భూభాగం నుంచి తరిమికొట్టే ప్రయత్నంలో కాకపోతే మరి ఎందుకు మనవాళ్లు 20 మంది చనిపోవాల్సి వచ్చింది?
  • గాల్వన్ లోయ తమదేనని చైనా చెబుతోంది. గాల్వన్ లోయలో ఎలాంటి ఆక్రమణలు లేవని ప్రధాని మోదీ చెప్పడం చైనా వాదనను బలపర్చడం కాదా?
  • గాల్వన్ లోయలో చైనా చొరబాట్లు లేవని, భారత ప్రాదేశిక భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేదని చెబుతున్నప్పుడు, వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన చీఫ్ దేనికి ప్రకటించినట్టు?
  • 20 మంది భారత సైనికులు మృతి చెందిన గాల్వన్ లోయలోని 14వ నెంబరు గస్తీ పోస్టు ఇప్పటికీ చైనా బలగాల అధీనంలోనే ఉందా? ఆ గస్తీ పోస్టు ఉన్న భూభాగం వాస్తవాధీన రేఖ వద్ద భారత్ వైపు ఉందా, లేక చైనా వైపు ఉందా?
  • పాంగోంగ్ ట్సో సరస్సు పరిస్థితి ఏంటి? ఆ సరస్సుకు చెందిన ఎంత మేర భూభాగం ఇప్పుడు భారత్ పరిధిలో ఉంది?
  • సైనికుల మరణం నేపథ్యంలో అయినా, గాల్వన్ లోయ, పాంగోంగ్ ట్సో సరస్సులతో కూడిన భారత భూభాగం అధికారిక మ్యాప్ లను విడుదల చేస్తారా?
  • 2014 నుంచి 2020 జూన్ 16 వరకు లడఖ్ వద్ద ప్రాదేశిక భూభాగం పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా?
అంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాదు. ఏ ప్రధానమంత్రికి కూడా పార్లమెంటు ఆమోదం లేకుండా భారత భూభాగాన్ని ఇతర దేశాలకు అప్పగించే అధికారం లేదని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎంఐఎం పార్టీని ఆహ్వానించలేదని ఒవైసీ ఇదివరకే అసంతృప్తి వ్యక్తం చేశారు.

More Telugu News