ప్రపంచపు టెలికం డీల్స్ లో సగం ముఖేశ్ అంబానీవే!

20-06-2020 Sat 10:05
  • ఈ సంవత్సరం 30 బిలియన్ డాలర్ల డీల్స్
  • 15.2 బి. డాలర్లు జియోకే
  • ఇక డిజిటల్ వ్యాపార విస్తరణపై జియో ప్లాన్స్
This Years Half of the Telecom Deals Win Mukesh Ambani
ముఖేశ్ అంబానీ అధీనంలో ఉన్న జియో ప్లాట్ ఫామ్స్, ఈ సంవత్సరం ప్రపంచంలో కుదిరిన టెలికం డీల్స్ లో సగానికి పైగా దక్కించుకుని మరో రికార్డు నెలకొల్పింది. ఈ సంవత్సరం ఇప్పటివరకూ 30 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ టెలికం సంస్థల మధ్య కుదరగా, 50.7 శాతం డీల్స్ జియో పరమైనాయి. ఫేస్ బుక్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్ పార్టనర్స్ సహా మొత్తం 10 కంపెనీలు జియోతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుని మొత్తం 15.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. సౌదీ అరేబియాకు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ తాజాగా, జియోతో జతకడుతున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇక, ఈ సంవత్సరం టెలికం డీల్స్ పరిశీలిస్తే, జియో వాటా 50.7 శాతం కాగా, ఆసియా పసిఫిక్ రీజియన్ లో, జియో మినహా మిగతా సంస్థలు 16 శాతం డీల్స్ ను, యూరప్ లో 14.7 శాతం, ఉత్తర అమెరికాలో 12.3 శాతం, మధ్య ప్రాచ్య దేశాలు, ఆఫ్రికాలో 6 శాతం, ఇతర ప్రాంతాల్లో 0.3 శాతం డీల్స్ కుదిరాయి.

ఇక, జియోకు వచ్చిన పెట్టుబడులతో ముఖేశ్ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మారిపోయారు. అంతే కాదు, వచ్చే సంవత్సరం మార్చి నాటికి రుణ రహితం కావాల్సిన సంస్థ, 9 నెలల ముందుగానే లక్ష్యాన్ని అందుకుంది. ప్రస్తుతం జియోకు 40 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, వీరందరినీ ఈ-కామర్స్ వైపు మళ్లించి, వారికి అవసరమైన సేవలను అందించడం ద్వారా, డిజిటల్ వ్యాపారాన్ని పెంచుకోవాలన్నది జియో ప్రణాళిక.

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం తక్కువ టెలికం డీల్స్ కుదిరాయి. కరోనా కారణంగా ఎన్నో డీల్స్ చర్చల దగ్గరే నిలిచిపోయాయి. 2019లో జనవరి 1 నుంచి జూన్ 18 మధ్య, మొత్తం 63.1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు వివిధ కంపెనీల మధ్యా కుదరగా, ఈ సంవత్సరం అది 30 బిలియన్ డాలర్లకు తగ్గింది.