యుద్ధ విమానాల గర్జనలతో దద్దరిల్లుతున్న గాల్వాన్ లోయ!
- సరిహద్దులకు భారీ ఎత్తున ఫైటర్ జెట్స్
- హిందూ మహా సముద్రంలో నౌకాదళం అప్రమత్తం
- సరిహద్దుల్లో సైన్యాన్ని పెంచుతున్న చైనా
ఈ వారం ప్రారంభంలో గాల్వాన్ లోయ వద్ద, చైనా సైనికుల దాడిలో 20 మందికి పైగా భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చైనాను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలన్న ప్రధాని ఆదేశాలతో, భారీ ఎత్తున బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. సరిహద్దులకు చేరుకున్న యుద్ధ విమానాలు గస్తీ తిరుగుతున్నాయి.
ఇదే సమయంలో చైనా సైతం సరిహద్దులకు మరింత సైన్యాన్ని యుద్ధ విమానాలను తరలించింది. భారత శిబిరాలకు దాదాపు కిలోమీటర్ దూరంలోనే చైనా సైన్యం మోహరించిందని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. టిబెట్ లోని ఎంగారి వైమానిక స్థావరం నుంచి చైనా ఫైటర్ జెట్స్, తమ భూ భాగంలో గస్తీ తిరుగుతున్నాయి. చైనా సైన్యానికి పాకిస్థాన్ తనవంతు సహకారాన్ని అందిస్తోంది. అతి త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉన్న స్కర్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్ కూ విమానాలను తరలించాలని చైనా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.