Kanakamedala Ravindra Kumar: వారి సబ్జెక్ట్ కాకపోయినా మండలిలోకి 16 మంది మంత్రులు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది?: కనకమేడల

  • ప్రతిపక్ష నాయకులను జగన్ టార్గెట్ చేశారు
  • చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు
  • మహిళలు ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా మంత్రులు ప్రవర్తించారు
Why ministers went to Council ask Kanakamedala

యాక్టివ్ గా ఉండే ప్రతిపక్ష నాయకులను ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ చేశారని టీడీపీ రాజ్యసభసభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. తప్పుడు కేసుల్లో ఇరికించి, బెదిరించి, లొంగదీసుకోవాలనుకుంటున్నారని అన్నారు. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెద్దలసభ శాసనమండలిని కూడా దుర్వినియోగం చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు

ద్రవ్య వినిమయ బిల్లును పక్కన పెట్టి... సీఆర్డీయే, మూడు రాజధానుల బిల్లును పాస్ చేయించుకోవడానికే తహతహలాడారని కనకమేడల దుయ్యబట్టారు. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని  గత మండలి సమావేశాల్లో తీర్మానం చేస్తే... అది  అమలు కాకుండా మండలి కార్యదర్శి ద్వారా అడ్డుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఇదే అంశంపై కోర్టులో విచారణ జరిగినప్పుడు... ఈ బిల్లులు సెలెక్ట్ కమిటీలో ఉన్నాయని ఏజీ ఒప్పుకున్నారని తెలిపారు. బిల్లులు సెలెక్ట్ కమిటీలో ఉన్నప్పుడు... వాటిని మండలిలో ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలనుకోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

అనుకున్నది జరగకపోవడంతో మండలిలో విపక్షసభ్యులపై దాడికి దిగారని విమర్శించారు. వారికి  సంబంధించిన సబ్జెక్ట్ కాకపోయినా మండలిలోకి 16 మంది సభ్యులు ఎందుకు వెళ్లారని నిలదీశారు. సభలో మహిళలు ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా మంత్రులు ప్రవర్తించారని మండిపడ్డారు.

More Telugu News