Mukesh Ambani: రుణ రహితమైన రిలయన్స్: ముఖేశ్ అంబానీ కీలక ప్రకటన

Reliance Industries is Net Debt Free Now
  • ప్రపంచ ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,68,818 కోట్లను సేకరించిన సంస్థ
  • 58 రోజుల వ్యవధిలో భారీ పెట్టుబడులకు ఆహ్వానం
  • షేర్ హోల్డర్లకు ఇచ్చిన మాటను నిలుపుకున్నాం
  • ఈ ఉదయం వెల్లడించిన ముఖేశ్ అంబానీ
మీడియా, టెలికం నుంచి హైడ్రో కార్బన్స్ వరకూ వివిధ రంగాల్లో విస్తరించిన, భారత అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణ రహితమైంది. ఈ విషయాన్ని ముఖేశ్ అంబానీ స్వయంగా ఈ ఉదయం ఓ మీడియా ప్రకటనలో వెల్లడించారు. గడచిన 58 రోజుల వ్యవధిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలు ప్రపంచ ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,68,818 కోట్లను సేకరించాయని ఆయన స్పష్టం చేశారు.

గ్లోబల్ టెక్నాలజీ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 1,15,693.95 కోట్లను, రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,124.20 కోట్లను సేకరించామని, ఈ పెట్టుబడులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికరంగా రుణ రహితమైందని తెలిపారు. "ఇంత స్వల్ప సమయంలోనే మూలధన నిధులను సేకరించాం. ఇది భారత కార్పొరేట్ కంపెనీల చరిత్రలోనే ఊహించని పరిణామం. రిలయన్స్ కొత్త బెంచ్ మార్క్ లను సృష్టించింది. ప్రపంచమంతా కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఉన్న వేళ, ఈ ఘనతను ఓ భారత కంపెనీ సాధించడం అద్వితీయం" అని సంస్థ తరఫున ఈ ఉదయం ఓ పత్రికా ప్రకటన విడుదలైంది.

ఇదే సమయంలో పెట్రో రిటైల్ జాయింట్ వెంచర్ లో బీపీ (బ్రిటీష్ పెట్రోలియం)లో వాటాల అమ్మకాన్ని కూడా కలుపుకుంటే మొత్తంగా రూ. 1.75 లక్షల కోట్లకు పైగా సమీకరించినట్లు అవుతుందని, తన నికర రుణాల మొత్తం మార్చి 31 నాటికి రూ. 1,61,035 కోట్ల రూపాయలని, సేకరించిన పెట్టుబడుల మొత్తం రుణాన్ని అధిగమించిందని ముఖేశ్ అంబానీ తెలిపారు.

"వాటాదారులకు మేమిచ్చిన హామీని నెరవేర్చుకున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మార్చి 31 నాటికి రిలయన్స్ ను రుణ రహితంగా చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు గతంలోనే వెల్లడించాను. ఇప్పుడా కల సాకారమైంది. ఈ విషయంలో షేర్ హోల్డర్లు ఊహించిన సమయం కన్నా వేగంగానే అనుకున్నది సాధించాం. రిలయన్స్ వేసే ప్రతి అడుగూ వాటాదారుల ప్రయోజనాల కోసమే. సంస్థ గర్వించే ఈ క్షణాల్లో, రిలయన్స్ స్వర్ణ దశాబ్దంలోకి అడుగు పెట్టిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇక నిర్ధారించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తాం. రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీ కలలను నెరవేరుస్తాం. భారత అభివృద్ధిలో రిలయన్స్ తన వంతు పాత్రను నిర్వహిస్తుంది" అని ముఖేశ్ అంబానీ వ్యాఖ్యానించారు.

"గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి జియోతో భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు గత కొన్ని వారాలుగా ఎన్నో కంపెనీలు ముందుకు వచ్చాయి. దీంతోనే మా నిధుల సేకరణ లక్ష్యాలను చేరుకున్నాం. ఈ సందర్భంగా మార్క్ గ్రూప్ ఆఫ్ ఫైనాన్షియల్ పార్ట్ నర్స్ కు కృతజ్ఞతలు" అని ముఖేశ్ పేర్కొన్నారు. కాగా, గత 8 వారాల వ్యవధిలో జియో ప్లాట్ ఫామ్స్ రూ. 1,15,693.95 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. ఫేస్ బుక్, సిల్వర్ లేక్ం విస్తా ఈక్విటీ పార్ట్ నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముదాబాలా, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ కాటర్ టన్, పీఐఎఫ్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయన్న సంగతి తెలిసిందే.
Mukesh Ambani
Reliance
Debt Free
Investments
Jio

More Telugu News