IBM: ఇండియాలో సగం ఆఫీస్ స్పేస్ మూసివేత... ఐబీఎం కీలక నిర్ణయం!

  • పలు నగరాల్లో ఉన్న ఐబీఎం కార్యాలయాలు
  • అత్యధికులకు ఇంటి నుంచే విధులు
  • ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలో ఐబీఎం
  • అదే దారిలో టీసీఎస్ కూడా
IBM to Vacate Half Work Place in India

దేశవ్యాప్తంగా బెంగళూరు, హైదరాబాద్, నోయిడా, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో 10 లక్షల చదరపు అడుగులకు పైగా ఆఫీస్ స్పేస్ ను నిర్వహిస్తున్న ఐబీఎం, దానిలో సగాన్ని తగ్గించుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నగరాల్లోని భవనాల లీజ్ అగ్రిమెంట్లలో దాదాపు సగం అగ్రిమెంట్లను రద్దు చేసుకోనున్నట్టు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు పెరిగిన వేళ, ఇదే మోడల్ లో భవిష్యత్తులోనూ ఉద్యోగులతో పని చేయించుకోవడం ద్వారా ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చన్న ఆలోచనలో ఉన్న ఐబీఎం, ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ప్రస్తుతం ఇండియాలో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులు ఐబీఎంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిలో అత్యధికులు తమతమ ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా మార్చి చివరి వారం నుంచి వేల మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమై, ఆఫీసు పనులనూ చక్కబెడుతున్నారు. "కేవలం 25 శాతం మంది ప్రజలు రెగ్యులర్ గా ఆఫీస్ కు రావాల్సి వుంటుంది. ఇతరులు తమ వీలును బట్టి వచ్చి పోతుండవచ్చు. వారి ఉద్యోగాలన్నీ ఉంటాయి. అవే కార్యాలయాలు కొనసాగుతాయి" అని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఇక ఎప్పటిలోగా లీజ్ అగ్రిమెంట్లను సంస్థ రద్దు చేసుకోనుందన్న విషయంపైనా ఆయన వివరాలను వెల్లడించ లేదు. లీజ్ స్పేస్ అగ్రిమెంట్లను రద్దు చేసుకోవడంపై ఐబీఎం అధికారికంగా స్పందించాల్సి వుంది. తమకు చెందిన చాలా లీజ్ ఒప్పందాలు ఇప్పుడు రెన్యువల్ సమయానికి వచ్చాయని, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సంస్థ మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు.

ఇండియాలో కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన తరువాత, అన్ని ఐటీ కంపెనీలూ వర్క్ ఫ్రమ్ హోమ్ ను ప్రోత్సహించగా, ప్రస్తుతం దాదాపు 40 లక్షల మంది తమ ఇళ్ల నుంచే కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్, నాలుగింట, మూడొంతుల మందిని 2025 నాటికి ఇంటి నుంచే పని చేసేలా చూడాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది. ఆ సమయానికి ఇప్పుడున్న ఆఫీస్ స్పేస్ లో 25 శాతం మాత్రమే టీసీఎస్ వినియోగంలో ఉంటుందని అంచనా.

More Telugu News