India: ఏ మాత్రమూ తగ్గని చైనా... గాల్వాన్ లోకి బుల్డోజర్లు!

  • చర్చలు జరుగుతున్నా దుందుడుకు చర్యలు
  • వందలాది వాహనాలను తరలించిన చైనా
  • చైనా నిర్మాణాలను అడ్డుకుని తీరుతామన్న ఇండియా
China Send Buldogers to Galwan Vally

ఓ వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, చైనా సైన్యాధికారుల చర్చలు కొనసాగుతున్న వేళ, చైనా ఏ మాత్రమూ తగ్గకుండా, గాల్వాన్ లోయ ప్రాంతానికి బుల్డోజర్లను చేర్చింది. ఈశాన్య లడఖ్ లో గాల్వాన్ నది ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా చర్యలు చేబడుతోంది. ఈ విషయాన్ని తాజా శాటిలైట్ చిత్రాలు నిరూపించాయి. గాల్వాన్ లోయ ప్రాంతంలో చైనా తన కార్యకలాపాలను పెంచిందని ఈ చిత్రాలను బట్టి అర్థమవుతోంది. ఇదే సమయంలో చైనా ఎటువంటి దుశ్చర్యకు దిగినా, సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారీ ఎత్తున భారత సైనిక బలగాలు కూడా ఈ ప్రాంతంలో మోహరించాయి.

ఎల్ఏసీకి రెండు కిలోమీటర్ల పరిధిలో భారత ఆర్మీ ట్రక్స్ కనిపిస్తున్నాయి. గాల్వాన్ నది చాలా వరకూ ఎండిపోయి కనిపిస్తోంది. అయితే, భారత సైన్యాధికారి ఒకరు, నది లోయలో ప్రవహిస్తూనే ఉందని ఎన్డీటీవీకి స్పష్టం చేయడం గమనార్హం. ఈ ప్రాంతంలో భారత్, చైనా జవాన్లు తమ నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉన్నట్టు కూడా శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి.

ఈ ప్రాంతంలో చైనాకు చెందిన వందలాది ట్రక్కులు, బుల్డోజర్లు గాల్వాన్ లోయ, నదీ పరీవాహక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. చైనా వాహనాలు లోయకు 5 కిలోమీటర్ల దూరం వరకూ కనిపిస్తున్నాయని శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవాధీన రేఖను దాటి ముందుకు వచ్చి లోయను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా చైనా కనిపిస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు భారత జవాన్లు సిద్ధంగా ఉన్నారని సైనికాధికారులు వెల్లడించారు.

More Telugu News