ఏ మాత్రమూ తగ్గని చైనా... గాల్వాన్ లోకి బుల్డోజర్లు!
- చర్చలు జరుగుతున్నా దుందుడుకు చర్యలు
- వందలాది వాహనాలను తరలించిన చైనా
- చైనా నిర్మాణాలను అడ్డుకుని తీరుతామన్న ఇండియా
ఎల్ఏసీకి రెండు కిలోమీటర్ల పరిధిలో భారత ఆర్మీ ట్రక్స్ కనిపిస్తున్నాయి. గాల్వాన్ నది చాలా వరకూ ఎండిపోయి కనిపిస్తోంది. అయితే, భారత సైన్యాధికారి ఒకరు, నది లోయలో ప్రవహిస్తూనే ఉందని ఎన్డీటీవీకి స్పష్టం చేయడం గమనార్హం. ఈ ప్రాంతంలో భారత్, చైనా జవాన్లు తమ నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉన్నట్టు కూడా శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి.
ఈ ప్రాంతంలో చైనాకు చెందిన వందలాది ట్రక్కులు, బుల్డోజర్లు గాల్వాన్ లోయ, నదీ పరీవాహక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. చైనా వాహనాలు లోయకు 5 కిలోమీటర్ల దూరం వరకూ కనిపిస్తున్నాయని శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవాధీన రేఖను దాటి ముందుకు వచ్చి లోయను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా చైనా కనిపిస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు భారత జవాన్లు సిద్ధంగా ఉన్నారని సైనికాధికారులు వెల్లడించారు.