Guntur District: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నవదంపతుల దుర్మరణం

New Couple died in Road Accident in West Godavari dist
  • ఈ నెల 14న గుంటూరు జిల్లా గోవాడలో వివాహం
  • భార్యతో కలిసి కారులో సబ్బవరానికి బయలుదేరిన భర్త
  • ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవదంపతులు దుర్మరణం పాలయ్యారు. యడవల్లి వెంకటేశ్ (30), మానస నవ్య (26)లకు ఈ నెల 14న వివాహమైంది. నాలుగు రోజుల అనంతరం నిన్న మధ్యాహ్నం గుంటూరు జిల్లా గోవాడ నుంచి భార్య, ఆమె సోదరుడు భరత్‌తో కలిసి వెంకటేశ్ విశాఖ జిల్లా సబ్బవరానికి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోని పూళ్ల వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపునకు దూసుకెళ్లింది.

అదే సమయంలో ఏలూరు వైపు వెళ్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్, మానస నవ్య, భరత్, కారు డ్రైవర్ చంద్రశేఖర్ (64) తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్ చరణ్ స్థానికుల సాయంతో క్షతగాత్రులను తన వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేశ్, నవ్య, చంద్రశేఖర్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన భరత్ చికిత్స పొందుతున్నాడు. వివాహమై వారం రోజులు కూడా కాకముందే ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.
Guntur District
Visakhapatnam District
Road Accident
West Godavari District

More Telugu News