Supreme Court: ఈ సమయంలో రథయాత్రకు అనుమతిస్తే మమ్మల్ని ఆ పూరీ జగన్నాథుడు క్షమించడు: సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు

  • దేశంలో కరోనా మహమ్మారి స్వైరవిహారం
  • పూరీ రథయాత్ర నిలిపివేయాలంటూ సుప్రీంలో పిటిషన్
  • రథయాత్రపై స్టే ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం
Supreme Court gives stay on Puri Jahannadh Rathayatra

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం కోర్టు అభ్యంతరం చెప్పింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహించడం సమంజసం కాదంటూ స్టే మంజూరు చేసింది. ఈ రథయాత్ర చేపడితే లక్షలమంది తరలివస్తారని, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇది ఏమంత క్షేమకరం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రథయాత్రకు అనుమతిస్తే తమను ఆ పూరీ జగన్నాథుడు క్షమించబోడని అన్నారు. వైరస్ ఉద్ధృతి అంతకంతకు పెరుగుతున్న తరుణంలో ఒక్కచోటే పెద్ద సంఖ్యలో జనం గుమికూడడం మంచిది కాదని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా ఇలాంటి యాత్రలను అనుమతించలేమని స్పష్టం చేశారు.

వాస్తవానికి జూన్ 23 నుంచి పూరీ క్షేత్రంలో ఉత్సవాలు జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా నిర్వహించే రథయాత్రకు అనేక దేశాలకు చెందినవారు కూడా వస్తుంటారు. అయితే, కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్నందున ఈ రథయాత్రను నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

More Telugu News