Ladak: గాల్వాన్ పై పట్టు వదలని భారత్... మన అధీనంలోనే!

  • తాజా ఉపగ్రహ చిత్రాల విడుదల
  • చైనా సైన్యానికి మించిన భారత సైన్యం
  • అనుక్షణం పహారా కాస్తున్న ఆర్మీ
Galwan Vally in India Control

లడఖ్ సమీపంలోని గాల్వాన్ వ్యాలీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండియా, చైనా సరిహద్దుల్లో, భారత్ వైపున ఉన్న ఈ లోయ, ఈ ప్రాంతంలో అత్యంత కీలకం కావడంతో, ఈ లోయను ఆక్రమించుకునేందుకు ఎన్నో దశాబ్దాలుగా చైనా విఫలయత్నాలను చేస్తూనే ఉంది. తాజాగా, చైనా సైన్యం లోయను దాటి, భారత భూ భాగంలోకి జొరబడి, భారత సైనికులపై భౌతిక దాడికి దిగి, 20 మంది ప్రాణాలను కూడా తీసింది. ఇదే ఘటనలో చైనాకు చెందిన సైనికులు కూడా మరణించారని తెలుస్తున్నా, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఇక ఇంత సైనిక ఘర్షణ జరిగినా, లోయపై భారత సైన్యం, తన పట్టును కోల్పోలేదు. ఈ విషయం తాజా శాటిలైట్ చిత్రాలు నిరూపిస్తున్నాయి. చైనా దాడి జరిగిన 24 గంటల తరువాత, ఉపగ్రహాలు గాల్వాన్ లోయకు సంబంధించిన హై రెజల్యూషన్ చిత్రాలను తీసి అందించాయి. దీంతో ఇక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. చైనా సైన్యంతో పోలిస్తే, భారత సైన్యమే అధికంగా ఈ ప్రాంతంలో మోహరించింది.

చైనాకు చెందిన 200కు పైగా సైనిక వాహనాలు, చెక్ పోస్టులు ఉన్నట్టు ఈ చిత్రాల్లో కనిపిస్తుండగా, ఆంతకు మించిన భారత సైన్యం గాల్వాన్ లోయను కాపాడుకుంటోంది. బలగాలను కనీసం రెండున్నర కిలోమీటర్ల దూరం వెనక్కు తీసుకెళ్లాలని గత వారం జరిగిన సైన్యాధికారుల చర్చల్లో చేసుకున్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించి, ఈ దాడికి పాల్పడగా, మన సైన్యం ఏ మాత్రమూ వెనక్కు తగ్గకుండా లోయ ప్రాంతంలో తమ పట్టును నిలుపుకుంది.

కాగా, సోమవారం చైనా సైనికులతో జరిగిన దాడి తరువాత, కొందరు భారత సైనికులు అదృశ్యం కావడంతో, వారి కోసం హెలికాప్టర్లతో విస్తృత గాలింపును సైన్యం చేపట్టింది. మరోవైపు చైనా, డ్రోన్లను ప్రయోగిస్తూ, అదృశ్యమైన తమ సైన్యం కోసం గాలిస్తోంది. లోయలో పడిపోయిన కొందరు భారత సైనికుల ఆచూకీ లభ్యమైనట్టు తెలుస్తుండగా, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

గత కొంతకాలంగా గాల్వాన్ లోయ చుట్టూ రహదారిని నిర్మించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు చైనాకు కంటగింపుగా మారగా, ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇందుకోసం వ్యూహం పన్నిన చైనా పీపుల్స్ ఆర్మీ, దొంగ దెబ్బ తీసిందని, అందుకే మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని భారత సైన్యాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రాంతంలో చైనా ఓ చెక్ పోస్టును ఏర్పాటు చేయగా, భారత్ నిరసనలతో దాన్ని తొలగించారన్న సంగతి తెలిసిందే.

ఇదే చెక్ పోస్టును తిరిగి ఏర్పాటు చేస్తే, భారత సైన్యం వస్తుందని ముందుగానే అంచనా వేసిన చైనా సైనికులు, దాడికి సిద్ధంగా ఉన్నారని, అందుకు తగ్గ ఆయుధాలను సిద్ధంగా పెట్టుకుని దెబ్బ కొట్టారని ఆయన అన్నారు. సరిహద్దుల్లో సైన్యాలు సరిహద్దులను దాటడం సహజమేనని, అయితే, ఆ సమయంలో పక్క దేశ సైనికులు అడ్డుకుంటారని, ఆ సమయంలో వాగ్వాదాలు జరుగుతుంటాయని, 20 మందిని పొట్టన బెట్టుకునేంతటి దాడి జరిగిందంటే, అది ముందుగానే వేసుకున్న పక్కా ప్లానేనని అన్నారు.

More Telugu News