ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?: చంద్రబాబు

17-06-2020 Wed 16:19
  • లారీ చాసిస్ ల వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
  • ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోని ట్వీట్ చేసిన చంద్రబాబు
  • అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆగ్రహం
Chandrababu shares a video of YSRCP MP
బీఎస్-3 లారీ చాసిస్ లను కొనుగోళ్ల వ్యవహారంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో లారీ యజమానులు మరో వ్యక్తిపై ఆరోపణలు చేస్తుంటే, గౌరవనీయ ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పు అంటూ ఎగదోస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఓ వీడియో పంచుకున్నారు. ఆ వీడియోలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, కొందరు లారీ యజమానులతో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొనడం చూడొచ్చు.

టీడీపీ నేతలపై ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలని చంద్రబాబు ప్రశ్నించారు. మీడియా సమక్షంలోనే పబ్లిగ్గా ఇంత కుట్ర చేసిన వాళ్లు, తెరవెనుక ఇంకెన్ని చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని ట్వీట్ చేశారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సొంత కక్షలకు వాడుకోవడం నేరమని మండిపడ్డారు.