Perni Nani: రఘురామ కృష్ణంరాజు మూడు పార్టీలు తిరిగినా ఎవరూ సీటివ్వలేదు: పేర్ని నాని

Perni Nani responds on Raghurama Krishnamraju comments
  • అవసరాలకోసం పార్టీలోకి వచ్చి ఆ తర్వాత కనిపించడంలేదని విమర్శలు
  • వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కష్టంతోనే గెలిచారని వెల్లడి
  • చచ్చేవరకు జగన్ పట్ల విశ్వాసంతో ఉంటానన్న పేర్ని నాని
వైసీపీలో చేరాలని తనను బతిమాలుకుంటేనే ఆ పార్టీలో చేరానని, అంతకుముందు ఎన్నోసార్లు అడిగితే ఛీ కొట్టానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రఘురామకృష్ణంరాజు మూడు పార్టీలు తిరిగినా ఎవరూ సీటివ్వలేదని, చివరికి వైసీపీ సీటిచ్చిందని తెలిపారు. గతంలో ఎన్నికల్లో నామినేషన్ వేసి ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని నిలదీశారు. తాను కాబట్టే నరసాపురంలో గెలిచానని, తన వల్లే నరసాపురం లోక్ సభ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలకు ఓట్లు పడ్డాయని రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు కూడా పేర్ని నాని బదులిచ్చారు.

ఎమ్మెల్యేలకు ఎన్ని ఓట్లు వచ్చాయో, మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో ఓసారి సరిచూసుకోవాలని హితవు పలికారు. ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలను ఏ విధంగా గెలిపించారో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్సార్ బొమ్మ, జగన్ కష్టం వల్లే వైసీపీలోని ఎమ్మెల్యేలు గెలిచారని మంత్రి స్పష్టం చేశారు. సొంత అవసరాల కోసం పార్టీలోకి వచ్చి, ఆ తర్వాత కనిపించడంలేదని విమర్శించారు. తమను గెలిపించిన జగన్ పట్ల చచ్చేవరకు విశ్వాసంతో ఉంటామని అన్నారు. మోదీపై భయంతోనే చిదంబరం అరెస్టుపై రఘురామకృష్ణంరాజు మాట్లాడలేదని ఎద్దేవా చేశారు.
Perni Nani
Raghurama Krishnamraju
YSRCP
Narasapuram
MP
MLA
Jagan
YSR
Andhra Pradesh

More Telugu News