Bank Manager: విమర్శలతో ఉక్కిరిబిక్కిరి.. ఆ బ్యాంకు మేనేజర్‌పై వేటేసిన ఉన్నతాధికారులు

  • పింఛన్ కోసం శతాధిక వృద్ధురాలిని బ్యాంకుకు రమ్మన్న మేనేజర్
  • మంచాన్ని బ్యాంకు వరకు ఈడ్చుకొచ్చిన 70 ఏళ్ల కుమార్తె
  • విమర్శలతో విరుచుకుపడిన నెటిజన్లు
Manager suspended for forcing woman to drag elderly mother on cot to bank in Odisha

పెన్షన్ కావాలంటే బ్యాంకుకు రావాల్సిందేనంటూ 120 ఏళ్ల వృద్ధురాలని బ్యాంకుకు రప్పించిన మేనేజర్‌పై ఉన్నతాధికారులు వేటేశారు. ఒడిశాలోని నౌపడ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనమైంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఖరియర్ బ్లాకులోని బరాగన్ గ్రామానికి చెందిన లాభీ బాగేల్ అనే శతాధిక వృద్ధురాలు అనారోగ్యంతో  మంచం పట్టింది. తనకు నెలనెలా వచ్చే పెన్షన్ డబ్బులు తీసుకురావాల్సిందిగా 70 ఏళ్ల కుమార్తె గుంజాదేవిని బ్యాంకు పంపింది.

అయితే, అలా ఎవరికి పడితే వారికి పెన్షన్ డబ్బులు ఇవ్వబోమని, ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఆమె బ్యాంకుకు రావాల్సిందేనని మేనేజర్ తెగేసి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని గుంజాదేవి ఇంటికెళ్లి తన తల్లి పడుకున్న మంచాన్ని బ్యాంకు వరకు ఈడ్చుకొచ్చింది. లాభీ భాగేల్‌ను చూసిన తర్వాత కానీ అధికారులు పింఛన్ డబ్బులు విడుదల చేయలేదు.

వృద్ధురాలిని మంచానికి కట్టి బ్యాంకు ఈడ్చుకొస్తున్న వీడియో వైరల్ కావడంతో బ్యాంకు అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం రూ. 1500 పెన్షన్ కోసం ఇద్దరు వృద్ధ మహిళలతో బ్యాంకు అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు వృద్ధురాలిని బ్యాంకుకు తీసుకురమ్మన్న ఉత్కల్ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ను సస్పెండ్ చేశారు.

More Telugu News