AP Assembly Session: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... నల్లచొక్కాలతో హాజరుకావాలని టీడీపీ నిర్ణయం

  • గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్న సమావేశాలు
  • అక్రమ అరెస్ట్ లపై నిలదీయాలని భావిస్తున్న టీడీపీ
  • సభ్యులందరికీ కరోనా పరీక్షలు
AP Assembly sessions set to start tomorrow

ఓవైపు కరోనా భూతం తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో  ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజుల పాటు జరగనున్నాయి. రేపు, ఎల్లుండి జరిగే ఈ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్న విపక్ష టీడీపీ నల్లచొక్కాలు ధరించి రావాలని భావిస్తోంది. అక్రమ అరెస్టులు, ఇసుక అక్రమాలు, మద్యం ధరల పెంపు, ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని టీడీపీ భావిస్తోంది. తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్ట్ పై టీడీపీ సభ్యులు గవర్నర్ కు వినతిపత్రం సమర్పించనున్నారు.  

కాగా, అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. దేశంలోనే తొలిసారిగా గవర్నర్ ఆన్ లైన్ లో ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఎన్నిరోజులు సభ జరపాలన్నది బీఏసీ నిర్ణయించనుంది. రేపటి సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అలాగే, ఏపీలో జరుగుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలో బలంగా వినిపించాలని వైసీపీ సభ్యులు నిశ్చయించుకున్నారు. ఇక కరోనా నేపథ్యంలో, అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కరోనా టెస్టులు చేయించుకున్నారు.

More Telugu News