Supreme Court: ఎల్జీ పాలిమర్స్ పిటిషన్లపై వచ్చే వారాంతానికి నిర్ణయం తీసుకోండి: ఏపీ హైకోర్టుకు సుప్రీం స్పష్టీకరణ

  • ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ
  • సుమోటోగా తీసుకునేందుకు ఎన్జీటీకి అధికారం ఉందన్న సుప్రీం
  • పాస్ పోర్టుల కోసం హైకోర్టుకు వెళ్లాలని ఎల్జీ పాలిమర్స్ కు దిశానిర్దేశం
Suprme Court directs LG Polymers to approach AP High Court

వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన మూడు పిటిషన్లపై వచ్చే వారాంతానికి విచారణ పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఏపీ హైకోర్టుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్లాంట్ లోకి వెళ్లేందుకు, ప్లాంట్ లోని మెటీరియల్ ను స్వాధీనం చేసుకునేందుకు అనుమతులు కోరుతూ ఎల్జీ పాలిమర్స్ కొన్నిరోజుల కిందట హైకోర్టును ఆశ్రయించింది. వీటిపై సత్వరమే విచారణ జరిపి, తీర్పు వెలువరించాలని సుప్రీం ఆదేశించింది.

అంతేగాకుండా, గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించే అధికారం ఎన్జీటీకి ఉందని సుప్రీం స్పష్టం చేసింది. పర్యావరణానికి ముడిపడి ఉన్న ఏ అంశంలోనైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు స్పందించేందుకు ఎన్జీటీకి అధికారాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక, అధికారులు స్వాధీనం చేసుకున్న తమ సంస్థ డైరెక్టర్ల పాస్ పోర్టులు తిరిగి పొందేందుకు ఎల్జీ పాలిమర్స్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం సూచించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

More Telugu News