KCR: 10 రోజుల్లో 50 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశం

  • హైదరాబాద్, పరిసరప్రాంతాల్లో కరోనా తీవ్రత
  • హైదరాబాద్ ను కాపాడుకుంటామన్న సీఎం కేసీఆర్
  • ఎన్ని కేసులు వచ్చినా చికిత్స అందిస్తామని స్పష్టీకరణ
CM KCR reviews on corona spreading in Telangana

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే 10 రోజుల్లో ముందుజాగ్రత్తగా 50 వేల మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 30 నియోజకవర్గాల్లో ఈ పరీక్షలు చేపడతామని వివరించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ ఐదు జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్ ల సేవలు కూడా ఉపయోగించుకోవాలని తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా టెస్టులకు అవసరమైన మార్గదర్శకాలు, ఫీజులు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు వస్తుండడం పట్ల సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే 50 వేల మందికి ముందస్తు పరీక్షలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చినా చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

More Telugu News