Raghu Rama Krishnam Raju: అచ్చెన్నాయుడు వ్యవహారంలో రాష్ట్ర మంత్రులపై వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

  • అచ్చెన్నను అరెస్ట్ చేసిన విధానం సరికాదు
  • చంద్రబాబును అనుమతించకపోవడం మానవహక్కుల ఉల్లంఘనే
  • రంగుల విషయంలో కోర్టు తీర్పును అమలు చేయక తప్పదు
Ministers statements may damage party says YSRCP MP Raghu Rama Krishnam Raju

ఈఎస్ఐ స్కామ్ లో టీడీపీ నేత అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయడం, ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబును అనుమతించకపోవడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్టంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ డిస్కషన్ లో ఆయన మాట్లాడుతూ, అచ్చెన్నాయుడుని గోడ దూకి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని... అయితే, ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని చెప్పారు. అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడ్డారు. అచ్చెన్నను అరెస్ట్ చేయబోతున్న సంగతి జగన్ కు తప్ప మరెవరికీ తెలియదని అన్నారు.

రోజుకొక టీడీపీ నేత అరెస్ట్ అవుతారంటూ రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మంత్రుల వ్యాఖ్యల వల్ల... టీడీపీ నేతలను కావాలనే అరెస్ట్ చేస్తున్నారని ప్రజలు అనుకునే అవకాశం ఉందని చెప్పారు. కొందరు వైసీపీ నేతల అత్యుత్సాహం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని అన్నారు. అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబును అనుమతించకపోవడం కూడా సరైంది కాదని... ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు. జగన్ తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని నచ్చక ప్రతిపక్షాలు కోర్టుల్లో పిటిషన్లు వేశాయని అన్నారు. కార్యాలయాలకు రంగుల విషయంలో కోర్టు తీర్పును అమలుచేయక తప్పదని తెలిపారు.

పార్టీలో విజయసాయిరెడ్డి పవర్ ను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని, ఆయనను పక్కన పెట్టేశారని, పార్టీలో విభేదాలు ఎక్కువవుతున్నాయని అనుకుంటున్నారని... సోషల్ మీడియాకు ఇన్చార్జి తానే అంటూ విజయసాయిరెడ్డి చెప్పిన అరగంటకే... సోషల్ మీడియా ఒక రొచ్చుగుంట అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారని చానల్ ప్రతినిధి ప్రశ్నించగా... 'అంతఃపుర రాజకీయాల్లోకి నన్ను లాగకండి' అని విన్నవించారు.

More Telugu News