Tammineni Sitaram: అచ్చెన్నాయుడు ఏమైనా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారా?: స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు

  • అచ్చెన్న అరెస్ట్ లో విధానపరమైన లోపాల్లేవని వెల్లడి
  • జైళ్ల శాఖ, ఏసీబీ కోర్టు నుంచి కూడా సమాచారం వచ్చిందన్న తమ్మినేని
  • బీసీ అయితే నేరం చేసినా వదిలేయాలా? అంటూ వ్యాఖ్యలు
AP Assembly Speaker Tammineni Sitharam comments on Atchannaidu issue

టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏసీబీ అధికారులు తనకు సమాచారం అందించారని స్పష్టం చేశారు. శాసనసభ్యుడి వివరాలు, కేసు నమోదు వివరాలను తనకు పంపించారని వెల్లడించారు. అంతేకాకుండా, ఏసీబీ కోర్టు నుంచి, జైళ్ల విభాగం నుంచి కూడా తనకు సమాచారం వచ్చిందని స్పీకర్ వివరించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ప్రక్రియలో ఎక్కడా విధానపరమైన లోపం లేదని, నిబంధనలకు అనుగుణంగానే ఉందని తెలిపారు.

ఈఎస్ఐ ఔషధాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ నిర్ధారించిందని, ఈ వ్యవహారంలో ఆధారాలు ఉన్నందునే అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. అచ్చెన్నాయుడు బీసీ అయినందునే ఇందులోకి లాగారంటూ ఆరోపణలు వస్తున్నాయని, బీసీ అయితే నేరం చేసినా పట్టించుకోకూడదా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు. అయినా అచ్చెన్నాయుడు ఏమైనా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారా? అంటూ ఎద్దేవా చేశారు.

తప్పు చేసింది అచ్చెన్నాయుడు అయితే దాన్ని బీసీలందరికీ ఎలా ఆపాదిస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీశారు. అక్రమాలకు, బీసీలకు ఏమిటి సంబంధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, తప్పు చేసినవాళ్లు భూమిలో దాక్కున్నా అరెస్ట్ చేస్తారని, గోడలు దూకడం కాదు, గోడలు బద్దలు కొట్టుకుని వెళ్లి అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు.

More Telugu News