Corona Virus: అకస్మాత్తుగా రుచి, వాసన చూసే శక్తిని కోల్పోతే అది కరోనా కావొచ్చంటున్న కేంద్రం

  • మరికొన్ని కరోనా లక్షణాలను జాబితాలో చేర్చిన కేంద్రం
  • జలుబు, జ్వరం, దగ్గు ఇప్పటివరకు ఉన్న ప్రధాన లక్షణాలు
  • మరికొన్ని లక్షణాలతో కొవిడ్-19 డాక్యుమెంట్ తీసుకువచ్చిన కేంద్రం
Centre says sudden lose of smell and taste would be corona

ఇప్పటివరకు జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, కళ్లు ఎర్రబారడం, అలసట, శ్వాస తీసుకోలేకపోవడం, గొంతునొప్పి, విరేచనాలు వంటి సమస్యలను కరోనా లక్షణాలుగా పేర్కొంటున్నారు. వీటికి అదనంగా కేంద్రం మరికొన్ని లక్షణాలను కూడా జాబితాలో చేర్చింది. ఉన్నట్టుండి వాసన, రుచి చూసే శక్తి కోల్పోవడాన్ని కూడా ఓ లక్షణంగా చేర్చారు. 'క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్: కొవిడ్-19' అనే ప్రత్యేక డాక్యుమెంట్ లో ఈ మేరకు ప్రచురించారు. ఈ ప్రత్యేక పత్రాన్ని దేశవ్యాప్తంగా వైద్య నిపుణుల సందేహ నివృత్తి కోసం అందించనున్నారు. వాసనలు గుర్తించడంలో విఫలం కావడం, రుచిని తెలుసుకోలేకపోవడం కూడా కరోనా వైరస్ కారణంగా కలిగే వ్యాధి లక్షణాలు కావొచ్చని కేంద్రం అభిప్రాయపడింది.

ఇక, కరోనా వ్యక్తి నుంచి వ్యక్తికి నేరుగా ఎలా సోకుతుందో కూడా ఈ డాక్యుమెంట్ లో నిర్వచించారు. ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలగడం, ప్రధానంగా ముక్కు, నోటి నుంచి పడే తుంపర్లతో వైరస్ వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా అతడి ముక్కు, నోటి నుంచి పడే తుంపర్లు ఏదైనా ప్రదేశంపై పడితే, ఆ ప్రదేశాన్ని ఎవరైనా తాకి, ఆ చేతిని కళ్ల వద్ద, ముక్కు, నోటి వద్ద తాకించినా కరోనా సోకుతుందని వివరించారు.

More Telugu News