Maharashtra: మహారాష్ట్రలో మళ్లీ ఫుల్ లాక్ డౌన్ అంటూ వార్తలు.. ట్విట్టర్ ద్వారా సీఎం థాకరే స్పందన!

  • మహారాష్ట్రలో లక్షకు చేరువవుతున్న కరోనా కేసులు
  • జూన్ 15 నుంచి మళ్లీ లాక్ డౌన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • మళ్లీ లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదన్న సీఎంఓ
Amid full lockdown rumours Uddhav Thackeray tweets

కరోనా దెబ్బకు మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 2,97,535 కేసులు నమోదైతే... అందులో కేవలం మహరాష్ట్రలోనే 97,648 కేసులు నమోదయ్యాయి. లక్ష కేసుల దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్లీ పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. జూన్ 15 నుంచి లాక్ డౌన్ అమల్లోకి రాబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కార్యాలయం ట్విట్టర్ ద్వారా స్పందించింది.

లాక్ డౌన్ ను మళ్లీ విధించే ప్రసక్తే లేదని ట్విట్టర్ లో తెలిపింది. ప్రజలు గుంపులుగా గుమికూడవద్దని ముఖ్యమంత్రి కోరారని పేర్కొంది. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని విన్నవించారని తెలిపింది.

ఈ వార్తలపై ఉద్ధవ్ థాకరే కుమారుడు, మంత్రి ఆదిత్య థాకరే కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... లాక్ డౌన్ కు సంబంధించి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని ముఖ్యమంత్రి కోరారని... తద్వారా మరో లాక్ డౌన్ కు దగ్గర కాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజల సంరక్షణే ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు.

More Telugu News