Chiranjeevi: సినీ కార్మికులకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి: చిరంజీవి

  • లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన సినీ వర్కర్లు
  • సాయం చేసేందుకు సీసీసీ ఏర్పాటు
  • నాణ్యతలో రాజీపడడంలేదన్న చిరంజీవి
Chiranjeevi tells this month also CCC helps cine workers

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో అందరితో పాటే సినీ కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఉపాధిలేక కష్టాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో సినీ వర్కర్లను ఆదుకునేందుకు చిత్రసీమ పెద్దలు మనకోసం పేరిట కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఏర్పాటు చేశారు. దీని ద్వారా వేలాది మంది టాలీవుడ్ సినీ కార్మికులకు ఆర్థికసాయం, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, ఈ నెల కూడా సినీ కార్మికులకు పెద్ద ఎత్తున బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందిస్తున్నామని, ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు.

సినీ పరిశ్రమలో దినసరి వేతనాలపై పనిచేస్తున్న వర్కర్లకు వారి ఇంటి వద్దకే సాయం అందజేస్తున్నామని, ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో ప్యాక్ చేసిన సరుకులనే ఇస్తున్నామని వివరించారు. నాణ్యతలో రాజీపడకుండా, ఎంతోమంది వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని వారిందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చిరంజీవి ట్వీట్ చేశారు.


More Telugu News