KCR: మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది.. 8 జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్

  • తెలంగాణకు 200 కి.మీ. దూరంలో మిడతలు ఉన్నాయి
  • దక్షిణ దిశలో కదిలితే తెలంగాణలోకి వస్తాయి
  • అదే జరిగితే ఈ నెల 20 నుంచి జులై 5 మధ్యలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి
Locust has reached nearer to Telangana says KCR

మిడతల దండు పలు రాష్ట్రాల్లో పంటను నాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిడతల దండు కదలికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాచారం తెప్పించుకుని, అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధికారులతో సీఎం మాట్లాడుతూ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకు మిడతలు వచ్చాయని చెప్పారు. తెలంగాణకు 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని అజ్ని అనే గ్రామం దగ్గర మిడతల దండు ఉందని చెప్పారు. ఈ మిడతలు దక్షిణ దిశగా సాగితే తక్కువ సమయంలోనే తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. అదే జరిగితే ఈ నెల 20 నుంచి జులై 5 మధ్యలో తెలంగాణలోకి మిడతలు వస్తాయని చెప్పారు.

భద్రాచలం, వెంకటాపురం, చర్ల, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్, బోధన్, జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ, తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మిడతలు దాడి చేస్తే భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

More Telugu News