SEC: నిమ్మగడ్డ కేసులో సుప్రీంకోర్టు విచారణ.. ఏపీ ప్రభుత్వ వాదనలు ఇవే!

Supreme court denies to give stay on High Court judgement in SEC Ramesh issue
  • ఎస్ఈసీ తొలగింపును తప్పు పట్టిన సుప్రీంకోర్టు
  • నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని కోరిన లాయర్  
  • పూర్తి విచారణ తర్వాత ఆదేశాలిస్తామన్న సుప్రీం
  • ప్రతివాదులందరికీ నోటీసులు 
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ లాయర్లు ముకుల్ రోహత్గి, రాకేశ్ ద్వివేదీ వాదనలను వినిపిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, ఎన్నికల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక వ్యవస్థలకు సంబంధించి... హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోందని చెప్పారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను కొట్టివేసిందని... మరోవైపు అవే నిబంధనల ప్రకారం నిమ్మగడ్డ రమేశ్ ను పదవిలో కూర్చోబెట్టాలంటూ విరుద్ధమైన అభిప్రాయాలను వెల్లడించిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే  ఆర్డినెన్స్ ను తీసుకొచ్చారని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ధర్మాసనాన్ని కోరారు.

ఈ వాదననలపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ... రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడటం తగదంటూ... రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ జారీ చేయడం వెనకున్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని అన్నారు. ఇలాంటి వ్యవహారాలు వ్యవస్థలకు మంచిది కాదని చెప్పారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేశారు.

మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని... రమేశ్ కుమార్ తరపు లాయర్ హరీశ్ సాల్వే, టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాది ఏకే గంగూలీ ధర్మాసనాన్ని కోరారు. అయితే, ఈ అంశంపై ఇప్పటికిప్పుడే ఆదేశాలు ఇవ్వలేమని, రెండు వారాల తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆదేశాలను జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో ప్రతివాదులు చాలా మంది ఉన్నారని, అందరికీ నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పింది. రెండు వారాల్లోగా ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేస్తే తదుపరి విచారణను కొనసాగిస్తామని చెప్పిన ధర్మాసనం... తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
SEC
Andhra Pradesh
Nimmagadda Ramesh Kumar
Supreme Court
AP High Court

More Telugu News