Andhra Pradesh: తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టుల ఎత్తివేత... అయినా దాటాలంటే ఏపీ అనుమతి తప్పనిసరి!

  • ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న ప్రజలు
  • ఇటు నుంచి వెళితే మాత్రం ఆంక్షలు
  • మరికొన్ని రోజుల్లో తొలగిపోతాయంటున్న అధికారులు
Permission Must to Entry in AP

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి సడలింపులను మరింతగా పెంచిన తరువాత, వివిధ రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద గతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న వాహనాలకు ప్రస్తుతం అధికారులు ఎటువంటి ఆటంకాలనూ కలిగించడం లేదు. ఇదే సమయంలో తమ వారిని చూసేందుకు, అత్యవసర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడానికి బయలుదేరుతున్న తెలంగాణ వాసులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.

తన సరిహద్దులను ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా తెరవకపోవడమే ఇందుకు కారణం. కేవలం అత్యవసర వాహనాలు, పాస్ లను కలిగివున్న వారిని మాత్రమే సరిహద్దులు దాటి ఏపీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి అన్ని రకాల వాహనాలూ తెలంగాణలోకి వస్తుండగా, ఇటు నుంచి వెళ్లే వాహనాల్లో అనుమతి ఉన్న వాటికి మాత్రమే ప్రవేశం లభిస్తోంది.

కాగా, రెండు రాష్ట్రాల మధ్యా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపించేందుకు మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని, ఆపై ఏపీ సరిహద్దుల వద్ద కూడా ఆంక్షలు తొలగిపోతాయని అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే వాడపల్లి, నాగార్జున సాగర్, కోదాడ సమీపంలోని చెక్ పోస్టులను ఎత్తివేయగా, సరిహద్దులకు ఆవల ఏపీ చెక్ పోస్టులు మాత్రం కొనసాగుతున్నాయి.

కాగా, రెండు రాష్ట్రాల మధ్యా అత్యంత ప్రధానమైన హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణ బస్సులు రామాపురం క్రాస్ రోడ్స్ లోని చెక్ పోస్టు వరకూ, ఏపీ బస్సులు గరికపాడు వరకూ నడుస్తున్నాయి.

More Telugu News