Upasana: చరణ్, నేను ఒకరి స్వేచ్ఛని మరొకరం గౌరవించుకుంటాం: ఉపాసన

  • స్వతంత్రంగా బతికేలా తల్లిదండ్రులు పెంచారు
  • ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలన్నదే అభిమతం
  • పెళ్లి తరువాత అడ్జెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి
  • రామ్ చరణ్, నేను స్నేహితులకన్నా ఎక్కువగా వుంటాం 
  • తాజా ఇంటర్వ్యూలో ఉపాసన
Upasana Comments After Marriage Life

అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ప్రజలకు పరిచితమై, ఆపై మెగాస్టార్ ఇంటి కోడలిగా, రామ్ చరణ్ భార్యగా, తనవంతు పాత్రను పోషిస్తున్న ఉపాసన, తన తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలను ముచ్చటించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తనను తల్లిదండ్రులు ఎంతో స్వతంత్రంగా పెంచారని, ఈ సమాజంలో ఒంటరిగా బతకడాన్ని నేర్పించారని, వారి పెంపకంలో స్వతంత్రంగా బతకడాన్ని నేర్చుకున్నానని చెప్పారు.

తన తండ్రి ఎంతో ప్రముఖుడని గుర్తు చేసిన ఉపాసన, తన జీవితంలో ఆయన చూపిన ప్రభావాన్ని వర్ణించలేనని అన్నారు. ఎంతో కఠిన పరిస్థితులు ఎదురైనా, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే అలవాటును ఆయన నేర్పించారని, జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటి సాధనకు శ్రమించడం ఆయన్నుంచే అలవాటు అయిందన్నారు. ఇతరులపై ప్రేమ, జాలిని చూపించడాన్ని ఆయనే అలవాటు చేశారని ఉపాసన తెలిపారు.

పెళ్లి తరువాత తన జీవితంలో సహజంగా ఏర్పడిన మార్పులను గురించి వివరిస్తూ, వాటికి అడ్జస్ట్ కావడానికి ప్రయత్నించానని అన్నారు. తాను ఇష్టపడిన సెలబ్రిటీని వివాహం చేసుకోగలగడం తన అదృష్టమని చెప్పారు. తెరపై చూసే చరణ్ తో ఇంట్లోని చరణ్ ని పోల్చితే కనుక ఎంతో తేడా కనిపిస్తుందని ఆమె అన్నారు. భార్యా భర్తలుగా చెర్రీకి, తనకూ మధ్య ఒకరి వృత్తిని మరొకరు గౌరవించే పరిస్థితి, స్వేచ్ఛ వున్నాయని, తామిద్దరం స్నేహితుల కన్నా ఎక్కువగా ఉన్నామని అన్నారు.

ఈ లాక్ డౌన్ సమయంలో ఇద్దరమూ ఇంట్లోనే ఉన్నామని, కలిసి ఎంజాయ్ చేశామని వెల్లడించిన ఉపాసన, రామ్ చరణ్ కుటుంబం తనకు కేవలం ఓ సెలబ్రిటీ కుటుంబంగానే కాకుండా, ఓ బిజినెస్ ఫ్యామిలీగా కూడా తెలుసునని చెప్పారు. పరిస్థితులను బట్టి, పెళ్లి తరువాత అర్థం చేసుకుంటూ వెళుతున్నానని అన్నారు. రామ్ చరణ్ తో పెళ్లి తరువాత కోట్లాది మంది కళ్లు తనపై పడ్డాయని, తనపై ట్రోలింగ్స్ కూడా ఎన్నో వచ్చాయని చెప్పారు. వాటన్నింటికీ నిదానంగా అలవాటు పడ్డానని, ఈ విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇచ్చిన సలహాలు తనకెంతో ఉపయోగపడ్డాయని వెల్లడించారు.

More Telugu News