Mukesh Ambani: ముఖేశ్ అంబానీ సంస్థలోకి విదేశీ పెట్టుబడులు.. కేంద్రం ఓకే చెబుతుందా?

  • ఇటీవల భారీగా పెట్టుబడులను ఆహ్వానించిన జియో ప్లాట్ ఫామ్
  • రిలయన్స్ ను రుణ రహితంగా మారుస్తానని ముఖేశ్ హామీ
  • అడ్డంకిగా నిలువనున్న కేంద్రం నిర్ణయాలు
  • ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీ నిర్ణయాలే కీలకం
  • 5 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే కంపెనీలను ప్రోత్సహించాల్సిందే
  • అభిప్రాయపడుతున్న వ్యాపారరంగ విశ్లేషకులు
Mukesh Ambani Future in the Hands Of Central Govt

భారత పారిశ్రామిక దిగ్గజం, వరల్డ్ టాప్ బిలియనీర్లలో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భవిష్యత్తు, ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందా? అంటే, అవుననే అంటున్నారు బిజినెస్ అనలిస్టులు. ఇండియాలోని అతిపెద్ద ప్రైవేటు కార్పొరేట్ కంపెనీగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, తన అనుబంధ జియో ప్లాట్ ఫామ్స్ లో వాటాలను విక్రయించడం ద్వారా, తనకున్న రుణాలను తీర్చాలని భావిస్తుండగా, టెక్నాలజీకి, కమ్యూనికేషన్ సేవలకు ఇండియాలో ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్నో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూను ప్రకటించగా, అది 1.59 రెట్లు ఓవర్ సబ్ స్క్రయిబ్ అయింది. పెరుగుతున్న రుణాలను తగ్గించుకునేందుకు, మూలధన అవసరాలను తీర్చుకునేందుకు ఈ వాటాల అమ్మకాన్ని తెరపైకి తెచ్చినట్టు సంస్థ ఇప్పటికే వెల్లడించింది. గత సంవత్సరం ఆగస్టులో జరిగిన వాటాదారుల సమావేశంలోనూ ముఖేశ్ అంబానీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, సంస్థను రుణ రహితంగా చేస్తామని మాటిచ్చారు.

ఇక, ఇప్పటి పరిస్థితిని గమనిస్తే, ఓ ప్రణాళికాబద్ధంగా రిలయన్స్ అధినేత అడుగులు వేశారు. అందుకు తగ్గట్టుగానే, రిలయన్స్ అనుబంధ జియో ప్లాట్ ఫామ్స్ లోకి భారీ పెట్టుబడులు రావడంతో పాటు, ఈ నెల 3న ప్రకటించిన రైట్స్ ఇష్యూ కూడా విజయవంతం అయింది. అయితే, పెట్టుబడులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి కావడం ఇప్పుడు సంస్థకు కొన్ని ఆటంకాలను కలిగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇండియాలోని కంపెనీలకు విదేశాల నుంచి పెట్టుబడులు రావాలంటే, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ విభాగం నుంచి అనుమతులు ఉండాల్సిందే. ఇప్పుడదే ముఖేశ్ అంబానీకి ఇబ్బందులు కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గడచిన రెండు నెలల వ్యవధిలో రిలయన్స్ జియో దాదాపు రూ. 43 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించింది.

జియో ప్లాట్ ఫామ్స్ లో సోషల్ మీడియా జెయింట్ ఫేస్ బుక్ తో పాటు యూఎస్ కేంద్రంగా నడుస్తున్న మూడు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు విస్తా ఈక్విటీ పార్టనర్స్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్ లు పెట్టుబడులు పెట్టాయి. ఇదే సమయంలో మరో యూఎస్ సంస్థ కేకేఆర్, అబూదాబీకి చెందిన ముదాబాలాలు కూడా రంగంలోకి దిగాయి. దీంతో జియో ప్లాట్ ఫామ్స్ మార్కెట్ కాప్ భారీగా పెరిగిపోయింది.

ఈ ప్రభావం జియో ప్లాట్ ఫామ్స్ మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ పైనా పడింది. రిలయన్స్ ఈక్విటీ విలువ గణనీయంగా పెరుగగా, ఇండియాలో రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ కాప్ ను కలిగిన సంస్థగా రిలయన్స్ మరోసారి ఆవిర్భవించింది. ఇప్పుడిక రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్ ను కూడా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని ముఖేశ్ అంబానీ భావిస్తున్నారు. తన మిగతా సంస్థలను విదేశాల్లోనూ లిస్టింగ్ చేయించాలన్నది ఆయన యోచన.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఒకింత సుముఖంగానే ఉంది. భారత కంపెనీలు, తమ ఈక్విటీలను విదేశీ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలూ లేవని, గత నెల 17న జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆమె ప్రకటన తరువాతే జియోలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఎన్నో కంపెనీలు వేల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశాయి.

ఇక జియోలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, దాని ప్రతిఫలాన్ని వెంటనే అందుకున్నాయి కూడా. జియో ప్లాట్ ఫామ్స్ లో కేవలం 2 శాతం వాటాకన్నా తక్కువను కొనుగోలు చేసిన సిల్వర్ లేక్ విలువ ఇప్పుడు రూ. 5.16 లక్షల కోట్లకు పెరిగింది. సుమారు 40 బిలియన్ డాలర్ల విలువ గల ఈ కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న సంస్థ విలువ రిలయన్స్ లో వాటాలను పొందగానే, సుమారు రూ. 2 లక్షల కోట్లు పెరిగినట్లయింది. సిల్వర్ లేక్ ఇప్పటికే దిగ్గజ సంస్థలైన ఎయిర్ బీఎన్బీ, అలీబాబా, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, ట్విట్టర్, డెల్ తదితర సంస్థల్లోనూ ఇన్వెస్ట్ చేసింది.

ఇక ఇప్పుడు సమస్య ఎక్కడ ఉత్పన్నం అయ్యేలా ఉందంటే, రిలయన్స్ సంస్థ రైట్స్ ఇష్యూను మే 16న ప్రకటించింది. ఆశ్చర్యకరంగా, రైట్స్ ఇష్యూల జారీ విషయంలో నిబంధనలను సడలిస్తూ, సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ విధివిధానాలను జారీ చేసిన రెండు వారాల్లోనే రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని ఫైనాన్షియల్ మార్కెట్లను నియంత్రిస్తున్న సెబీ, మే 6న నిబంధనలను సడలించింది.

ఏదిఏమైనా, ఇక ఇప్పుడు ముఖేశ్ అంబానీ, తన సంస్థలకున్న రుణాలను తీర్చుకుని వాటాదారులకు హామీ ఇచ్చినట్టుగా, సంస్థను రుణ రహితం చేయాలంటే, కేంద్రం తదుపరి తీసుకునే నిర్ణయాలే కీలకం కానున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాబీలు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాయని తెలుస్తోంది.

ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా చేయాలన్న కేంద్ర లక్ష్యం నెరవేరాలంటే, రిలయన్స్ వంటి కంపెనీలను ప్రోత్సహించాల్సిందేనని, ఇండియాకు భారీగా విదేశీ పెట్టుబడులను అహ్వానించక తప్పదని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News