Elephant: కేరళ ఏనుగు మృతి కేవలం ప్రమాదమే... ఉద్దేశపూర్వక తప్పు లేదన్న పర్యావరణ శాఖ!

  • పేలుడు పదార్థాలను తిన్న ఏనుగు
  • నోట్లోనే బాంబులు పేలడంతో తీవ్ర అస్వస్థత
  • వెల్లియార్ నదిలో ప్రాణాలు కోల్పోయిన ఏనుగు
Kerala Elephant Died is an Accident

కేరళలో ఓ గర్భిణి ఏనుగు పేలుడు పదార్థాలను కలిపిన కొబ్బరి కాయను తిని, మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించగా, జంతు ప్రేమికులు నిందితులను కఠినంగా శిక్షించాలని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ, ఈ కేసు తేలిపోయింది. ఆ ఏనుగు ప్రమాదవశాత్తూ పేలుడు పదార్థాలను కలిపిన ఆహారాన్ని తిన్నదని ప్రాధమిక దర్యాప్తులో స్థానిక పోలీసులు తేల్చారని కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది.

"తమ పొలాల్లోకి అడవి పందులు చేరకుండా నిలువరించేందుకు కొందరు స్థానికులు ఈ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన పండ్లను ఎరగా వేస్తారని, అటువంటి ఒక పండునే ఈ ఏనుగు తిన్నదని, ఏదిఏమైనా ఏనుగు మరణానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకుని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని పర్యావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ ఏనుగు వయసు 15 సంవత్సరాలని, గర్భంతో ఉన్నదని, పండును తినడానికి ప్రయత్నించినప్పుడు అది నోటిలో పేలిపోయి ఉంటుందనే నిర్ధారణకు వచ్చామని పర్యావరణ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

ఇదిలావుండగా, నోట్లోనే పేలుడు సంభవించిన తరువాత, దాదాపు 20 రోజుల పాటు అది బాధపడిందని.. ఏం తినలేక పోతూ చివరకు చనిపోయిందని అధికారులు అంచనా వేశారు. తమకు పట్టుబడిన నిందితుడు ఈ విషయాన్ని వెల్లడించాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏనుగు వెల్లియార్ నదిలో ప్రాణాలు వదిలిందని అన్నారు. ఈ విషయంలో ఎవరిదీ ఉద్దేశపూర్వక తప్పు లేదని, అయినప్పటికీ, నిందితులను వదిలేది లేదని స్పష్టం చేశారు.

More Telugu News