లండన్ లో బారిస్టర్ చదివిండంట... ఎందుకయ్యా బొంద పెట్టుకోవడానికా?: అసదుద్దీన్ పై రేవంత్ పరోక్ష వ్యాఖ్యలు

08-06-2020 Mon 14:42
  • కేటీఆర్ పై రేవంత్ ధ్వజం
  • కేటీఆర్ కు మద్దతుగా ట్వీట్ చేసిన ఒవైసీపైనా విసుర్లు
  • కావాలంటే గులాంగిరీ చేసుకో అంటూ వ్యాఖ్యలు
Revanth Reddy take a dig at Owaisi
జన్ వాడలో అక్రమంగా ఫాంహౌస్ నిర్మిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాడని, ఎన్నో తప్పులు చేసి ఇరుక్కుపోయాక కూడా ఏమాత్రం సిగ్గుపడడంలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ నిప్పులు చెరిగారు. ఇటీవలే కేటీఆర్ ను ప్రస్తుతిస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ట్వీట్ ను దృష్టిలో ఉంచుకుని రేవంత్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

"అన్నీ అయిపోయాక ఓ లండన్ బారిస్టర్ ను తీసుకొచ్చిండు. ఆ లండన్ బారిస్టర్ నువ్వు వీరుడివి, శూరుడివి... నువ్వు ఎగిరితే ఆకాశం, నువ్వు దుమికితే పాతాళం... నీ అంత మొనగాడు లేడు, నిన్ను చూసి అసూయపడుతున్నారని అంటుండు. ఆరున్నర అడుగులు పెరిగినాయనకు సిగ్గుండాలి ఈ మాట అనడానికి! ఒళ్లు పెరిగితే సరిపోదు, కొంచెం బుర్రకూడా ఉండాలి ఈ ఆరున్నర అడుగులు పెరిగినాయనకు. ట్విట్టర్ లో ఈయనకు మద్దతు పలకనీకి వచ్చిండు... లండన్ లో బారిస్టర్ చదివిండంట, ఎందుకయ్యా నీ చదువు బొందపెట్టుకోవడానికా!" అంటూ మండిపడ్డారు.

నీకు అంతగా చేయాలనుకుంటే గులాం గిరీ చేసుకో, నీ పార్టీని తాకట్టు పెట్టుకో అంటూ రేవంత్ ఘాటుగా స్పందించారు. ఇక లండన్ బారిస్టర్ అయిపోయాక మిడతల దండును తీసుకొచ్చాడంటూ పరోక్షంగా నిన్న టీఆర్ఎస్ నేతల మీడియా సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించారు. "ఓ ఫొటో చూపించి నాకు, నా బావమరిది జయప్రకాశ్ రెడ్డికి వట్టినాగులపల్లిలో అక్రమ భూములున్నాయంటూ ఆరోపించారు. ఇటు నుంచి ఇటే పోదాం, ఎవరికి అక్రమ భూములు ఉన్నాయో నిరూపిద్దాం" అంటూ రేవంత్ సవాల్ విసిరారు.