Posani Krishna Murali: రేవంత్ రెడ్డిలా రూ.50 లక్షలు ఇస్తూ దొరికిపోయిన నాయకుడు మరొకరు కనిపించలేదు: పోసాని

Posani Krishnamurali comments on Revanth Reddy
  • మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి
  • కేటీఆర్ ను అవినీతిపరుడు అనడం నచ్చలేదని వెల్లడి
  • తెలంగాణకు కేటీఆర్, హరీశ్ రావు రెండు కళ్లు అంటూ వ్యాఖ్యలు
సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. గత కొన్నిరోజులుగా మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా పత్రికల్లో వస్తున్న కథనాలపై తాను మాట్లాడదలుచుకున్నానని వివరించారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పీఠంపై ఉన్నవాళ్లను పడగొట్టి తాను ఆ పీఠం ఎక్కాలని ఆశించేవాళ్లే ఇలా మాట్లాడతారంటూ రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో రూ.50 లక్షలు లంచం ఇస్తూ దొరికిపోయిన వ్యక్తి అని, ఇలా పట్టుబడిన రాజకీయ నాయకుడ్ని తాను మరెవ్వరినీ చూడలేదని పోసాని పేర్కొన్నారు. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ ను అవినీతిపరుడు అనడం, కేటీఆర్ రాజీనామా చేయాలని కోరడం తనకు నచ్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి రాజకీయ నాయకుల అవసరం ఉందని, ఉన్న ఒకరిద్దరు మంచి నాయకులపై బురద చల్లే ప్రయత్నాలు చేయడం బాధాకరమని అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఇద్దరు యువ నేతలు నీతికి ప్రతిరూపాలని, వారిలో ఒకరు కేటీఆర్, మరొకరు హరీశ్ రావు అని వెల్లడించారు. నూటికి నూరు శాతం వీళ్లు నిజాయతీపరులుని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణకు వీరిద్దరే రెండు కళ్లవంటివారని పోసాని అభివర్ణించారు. కేటీఆర్ ను తాను మొదట్నించి గమనిస్తున్నానని, అన్ని రంగాలపై అవగాహన పెంచుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కేటీఆర్ అని తెలిపారు.
Posani Krishna Murali
Revanth Reddy
KTR
Harish Rao
Telangana

More Telugu News