ఐపీఎల్ సందర్భంగా నన్ను 'కాలూ' అని పిలిచేవాళ్లు... ఆ పదానికి అర్థం అప్పట్లో తెలియలేదు: శామీ

06-06-2020 Sat 20:42
  • జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంపై శామీ స్పందన
  • 'కాలూ' అంటే నల్లవాడని ఇప్పుడు తెలిసిందన్న శామీ
  • జాత్యహంకారంపై పోరుకు అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి
Sammy says they were called him Kalu

వెస్టిండీస్ జట్టును తన సారథ్యంలో రెండుసార్లు ప్రపంచవిజేతగా నిలిపిన ఆల్ రౌండర్ డారెన్ శామీ వర్ణవివక్ష అంశంపై స్పందించాడు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వర్ణ వివక్ష సెగలు రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో శామీ మాట్లాడుతూ, గతంలో తాను ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడే సమయంలో తనను, శ్రీలంక క్రికెటర్ తిసర పెరీనాను చాలామంది 'కాలూ' అని హిందీలో పిలిచేవాళ్లని, అప్పట్లో ఆ పదానికి సరైన అర్థం తెలియలేదని వెల్లడించాడు. ఇప్పుడా పదానికి అర్థం 'నల్లవాడు' అని తెలిసి ఎంతో బాధగా ఉందని అన్నాడు.

అప్పట్లో తాను 'కాలూ' అంటే 'బలమైన గుర్రంలాంటివాడు' అని అనుకునేవాడ్నని, ఇప్పుడా విషయం తలుచుకుంటే ఆగ్రహం కలుగుతోందని తెలిపాడు. ఈ సందర్భంగా శామీ అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు విజ్ఞప్తి చేశాడు. జాతివివక్ష వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరాడు. జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటనలు అమెరికాకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచంలో అన్ని చోట్లా, నిత్యం జాత్యహంకారం దర్శనమిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.