Centre: తబ్లిగీ జమాత్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు అవసరంలేదు: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

  • తబ్లిగీ జమాత్ వ్యవహారంలో సీబీఐతో నిగ్గు తేల్చాలంటూ పిటిషన్
  • అఫిడవిట్ సమర్పించిన కేంద్రం
  • ఢిల్లీ పోలీసుల దర్యాప్తు భేషుగ్గా సాగుతోందని వివరణ
Centre tells apex court no need of CBI in Tabligi Jamaat issue

తబ్లిగీ జమాత్ వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు, ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్య వైఖరే కారణమని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రియ పండిత అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణలో భాగంగా కేంద్రం ఇవాళ అఫిడవిట్ సమర్పించింది. తబ్లిగీ జమాత్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు అవసరంలేదని ఆ అఫిడవిట్ లో పేర్కొంది. ఇందులో ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యం ఉందని తాము భావించడం లేదని స్పష్టం చేసింది.

చట్టాన్ని అనుసరించి, రోజువారీ విధానంలో దర్యాప్తు జరుగుతోందని, నిజాముద్దీన్ మర్కజ్ కు సంబంధించిన ఈ కేసులో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు కీలక దశలో ఉందని కేంద్రం వివరించింది. నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ దర్యాప్తు పూర్తవుతుందని భావిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ జోక్యం అవసరంలేదని అనుకుంటున్నామని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది.

More Telugu News