సినీ హీరో అక్షయ్‌ కుమార్‌ ఏడాది సంపాదన ఎంతో తెలుసా?.. ఫోర్బ్స్ జాబితాలో వెల్లడి

05-06-2020 Fri 13:38
  • అత్యధికంగా సంపాదిస్తోన్న సెలబ్రిటీల జాబితా
  • తొలి 100 సెలబ్రిటీల జాబితాలో అక్షయ్‌
  • రూ.366 కోట్ల ఆదాయంతో 52వ స్థానం
  • 'కాస్మెటిక్‌' రారాణి కైలీ జెన్నర్‌కు అగ్రస్థానం
akshay in forbes list

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తోన్న తొలి 100 సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ 52వ స్థానంలో నిలిచాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన ఈ జాబితాలో ఆయన తప్ప మరే బాలీవుడ్‌ నటుడు లేరు. గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మే వరకు ఆయన రూ.366 కోట్లు సంపాదించారు.

గత ఏడాది ఆయన ఆ జాబితాలో రూ.490 కోట్లతో 33వ స్థానంలో నిలిచారు. కాగా, 'కాస్మెటిక్‌' రారాణి కైలీ జెన్నర్‌ ఆ జాబితాలో ఈ ఏడాది రూ. 4,453 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. అక్షయ్‌ కుమార్‌తో అమెజాన్‌ ప్రైమ్‌ డిజిటల్‌ సిరీస్‌ కోసం రూ.75 కోట్లతో ఒప్పందం చేసుకోవడంతో ఈ ఏడాది ఆయన సంపాదనకు ఈ అంశం కలిసి వచ్చింది. ఈ జాబితాలో కైలీ జెన్నర్ తర్వాత వరుసగా కన్యే వెస్ట్‌, రోజర్‌ ఫెదరర్‌, క్రిస్టియనో రొనాల్డో చోటు సంపాదించుకున్నారు.