Telangana: సోమవారం నుంచి జాగ్రత్త సుమా... ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సలహా!

New Guidelines for Telangana People
  • కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి గైడ్ లైన్స్
  • మొత్తం 40 అంశాలతో సలహా సూచనలు
  • జీవో నంబర్ 75 విడుదల
సోమవారం నుంచి మరిన్ని లాక్ డౌన్ నిబంధనలు తొలగిపోనున్న వేళ, ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు ఇచ్చింది. మొత్తం 40 అంశాలను పొందుపరుస్తూ, సవివరమైన సలహా సూచనలు విడుదల చేస్తూ, జీవో నంబర్ 75ను జారీ చేసింది.

హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, దేవాలయాల్లో శానిటైజర్లు, ధర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరని, వెళ్లి వచ్చేందుకు మార్గాలు వేర్వేరుగా ఉండాలని, లిఫ్టుల్లో ఎక్కువ మంది వెళ్లే వీలు లేదని పేర్కొంది. హోటల్ కు వచ్చే అతిథుల వివరాలతో పాటు, వారి ఆరోగ్య పరిస్థితిపై స్వీయ ధ్రువీకరణ తీసుకోవాలని, రెస్టారెంట్లలో టేబుల్స్ మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్త పడాలని, ఏసీ 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలని, మాల్స్ లో చిన్నారులు ఆడుకునే స్థలాలను తెరవరాదని ఆదేశించింది. రెస్టారెంట్లు మొత్తం సీటింగ్ లో 50 శాతం మందినే అనుమతించాలని, అక్కడే తినకుండా, ఇంటికి తీసుకెళ్లే వారిని ప్రోత్సహించాలని సూచించింది.

ఇక కంటైన్ మెంట్ జోన్లలో కఠిన నిబంధనలు అమలవుతాయని, ఇక్కడి వారెవరూ కార్యాలయాలకు వెళ్లరాదని, ఇంటి నుంచి పనిచేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ, దాన్ని సెలవుగా ఎట్టి పరిస్థితుల్లోనూ యాజమాన్యాలు పరిగణించరాదని ప్రభుత్వం ఆదేశించింది. పనివేళలు దశలవారీగా ఉంచేలా చూడాలని, వాహనాలను సోడియం హైపోక్లోరైడ్ తో నిత్యమూ శుభ్రపరచుకోవాలని సూచించింది.

ఏదైనా ఆఫీసులో ఒకటి లేదా రెండు కేసులు వస్తే, వారు అంతకుముందు రెండు రోజుల పాటు తిరిగిన ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తే సరిపోతుందని, అంతకుమించి కేసులు వస్తే మాత్రం ఆ భవనాన్ని రెండు రోజులు మూసేయాలని, అప్పటి వరకూ ఎవరినీ అనుమతించ రాదని ఆదేశించింది.
Telangana
Corona Virus
Guidelines

More Telugu News