Rahul Dubey: అంతటి నిరసన జ్వాలల్లోనూ ఓ భారతీయుడి గురించి మాట్లాడుకుంటున్న అమెరికన్లు!

  • జార్జ్ ఫ్లాయిడ్ మృతితో అమెరికాలో నిరసనలు
  • కర్ఫ్యూ ప్రకటించడంతో ఆశ్రయం కోసం పరుగులు తీసిన ప్రజలు
  • వారికి తన ఇంట్లో ఆశ్రయం కల్పించిన భారతీయుడు
Indian man becomes hero in American community

అమెరికాలో ఇప్పుడు కరోనా కంటే జార్జ్ ఫ్లాయిడ్ మృతి వ్యవహారమే అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఫ్లాయిడ్ మరణంతో అమెరికాలోని నల్లజాతి సమాజం భగ్గుమంటోంది. ఏ నగరంలో చూసినా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ఓ భారతీయుడు అనూహ్యరీతిలో విపరీతమైన గుర్తింపు అందుకున్నాడు. అతని పేరు రాహుల్ దూబే (44). గత పదిహేడేళ్లుగా రాహుల్ వాషింగ్టన్ డీసీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు అల్వారెజ్ ట్రేడింగ్ కంపెనీ అనే సంస్థ ఉంది. నిన్నమొన్నటి వరకు ఎవరికీ తెలియని రాహుల్ దూబే ఏకంగా అమెరికా జాతీయ హీరో అనే స్థాయిలో ప్రచారం పొందుతున్నారు. ముఖ్యంగా నల్లజాతి నిరసనకారుల పాలిట ఆపద్బాంధవుడే అయ్యాడు.

అసలేం జరిగిందంటే.... అనేక నగరాల్లో హింస ప్రజ్వరిల్లడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. రాహుల్ నివసిస్తున్న ప్రాంతంలోనూ కర్ఫ్యూ ప్రకటించారు. అయితే, పగలంతా నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులు కర్ఫ్యూ ప్రారంభం కావడంతో ఎటు వెళ్లాలో తెలియక వీధుల వెంబడి పరుగులు తీశారు. వారిని పోలీసులు వెంటాతుండడం గమనించిన రాహుల్ దూబే కొందరిని తన ఇంట్లోకి తీసుకెళ్లారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు 70 మందికి పైగా ప్రజలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు.

ఎంత రాత్రివేళ అయినా, ఎవరు తలుపు తట్టినా విసుక్కోకుండా, తలుపు తీయడం, వారిని లోపలికి లాగి వెంటనే తలుపేయడం... రాత్రంతా రాహుల్ కుటుంబ సభ్యులు ఇలాగే చేశారు. అంతేకాదు, ఆ వచ్చిన వాళ్లకు ఆహారం కూడా అందించి రాహుల్ తన భారతీయ సంస్కృతిని అమెరికన్లకు కూడా రుచి చూపారు.

సోఫాల్లోనూ, బాత్ టబ్ లోనూ ఎక్కడపడితే అక్కడ జనం కనిపిస్తున్నా విసుక్కోలేదు సరికదా... చిన్నారితో వచ్చిన ఓ మహిళకు తన కొడుకు గదిని కేటాయించి పెద్ద మనసు ప్రదర్శించారు. ఈ విషయాన్ని నిరసనకారుల్లో ఒకరు సోషల్ మీడియాలో వెల్లడించడంతో రాహుల్ దూబే పేరు అందరికీ తెలిసింది. మీడియాలోనూ అతడి పేరు మార్మోగిపోయింది. దాంతో అతడింటికి మీడియా ప్రతినిధులు తరలివచ్చారు.

ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ, తన ఇంట్లో ఆశ్రయం పొందిన నిరసనకారుల్లో ఎవరూ అతిగా ప్రవర్తించలేదని, హుందాగా మసలుకుని ఉదయాన్నే కర్ఫ్యూ తొలగించగానే వెళ్లిపోయారని రాహుల్ దూబే వెల్లడించారు. మరో విషయం ఏంటంటే... అమెరికాలోని చాలామంది నల్ల జాతీయులు రాహుల్ దూబే ఈజ్ ఏ హీరో అంటూ తమ ట్విట్టర్ ప్రొఫైళ్లను అప్ డేట్ చేసుకున్నారు. ఈ చర్య అతడి పట్ల వాళ్ల కృతజ్ఞతా భావానికి నిదర్శనం అని చెప్పాలి.

More Telugu News