Telangana: సికింద్రాబాద్-గజ్వేలు రైల్వే లైను రెడీ.. 25 తర్వాత రైలు కూత ప్రారంభం!

  • ఈ నెల 8న రైలును నడిపి పరీక్షించనున్న అధికారులు
  • మనోహరాబాద్ నుంచి కొత్త మార్గం ప్రారంభం
  • తెలంగాణ వచ్చాక తొలి రైల్వే ప్రాజెక్టు
Secunderabad to Gajwel railway line ready

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 25 తర్వాత సికింద్రాబాద్ నుంచి గజ్వేలుకు తొలి రైలు పరుగులు తీస్తుంది. పనులన్నీ పూర్తి కావడంతో ఈ నెల 8న రైలును గరిష్ట వేగంతో నడిపించి పరీక్షించనున్నారు. ఈ సందర్భంగా ఏవైనా సాంకేతికపరమైన లోపాలు కనిపిస్తే సరిదిద్ది పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తారు.

ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే ఈ నెల 25 తర్వాత మంచి రోజు చూసుకుని రైలును ప్రారంభించనున్నారు. సింగిల్ లైన్ అయిన దీనిని వచ్చే ఐదేళ్ల కాలంలో విద్యుదీకరిస్తారు. ప్రస్తుతానికి ఈ మార్గంలో లోకోమోటివ్ ఇంజిన్‌తో రైలు తిరగనుంది. నిజానికి మార్చిలోనే ఈ మార్గంలో రైలు సేవలు ప్రారంభం కావాల్సి ఉన్నా లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంలో చేపట్టి పూర్తిచేసిన తొలి రైలు మార్గం ఇదే కావడం విశేషం.

నిజామాబాద్ రైల్వే లైనుపై ఉన్న మనోహరాబాద్ నుంచి ఈ కొత్తలైను ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,160 కోట్లు. ఈ మొత్తంలో మూడింట రెండువంతులు కేంద్రం భరిస్తుండగా, ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. మొత్తం నాలుగు దశల్లో ప్రాజెక్టు పనులు చేపడుతుండగా, తొలి దశలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్‌కు 32 కిలోమీటర్ల మేర రైలు నడపనున్నారు.

ఆ తర్వాత  గజ్వేల్‌–దుద్దెడ, దుద్దెడ-సిరిసిల్ల, సిరిసిల్ల-కొత్తపల్లి మార్గాల్లో పనులు చేపడతారు. ఈ మార్గంలో మనోహరాబాద్ తర్వాత నాచారం, బేగంపేట, గజ్వేల్ స్టేషన్లు ఉంటాయి. నాచారంలో ఇప్పటికే స్టేషన్, ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణం పూర్తయింది. అలాగే, ఈ మార్గంలో నాలుగు పెద్ద వంతెనలు, ఆరు ఆర్‌వోబీలు ఉన్నాయి.

More Telugu News