Irfan Pathan: అక్తర్ ను రెచ్చగొట్టి మ్యాచ్ ను ఎలా కాపాడుకున్నామో చెప్పిన ఇర్ఫాన్ పఠాన్

  • 2006లో ఫైసలాబాద్ లో భారత్, పాక్ జట్ల మధ్య టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 588 పరుగులు చేసిన పాక్
  • బదులుగా 603 పరుగులు చేసిన టీమిండియా
  • ధోనీ 148, పఠాన్ 90 పరుగులతో రాణింపు
Irfan Pathan reveals how they tackled Shoaib Akhtar in Faisalabad

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. 2006లో పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ టెస్టును తాము ఎలా డ్రా చేసుకున్నదీ వివరించాడు. ఆ టెస్టులో పాక్ తొలి ఇన్నింగ్స్ లో 588 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 500 పరుగులు దాటడం అంటే మ్యాచ్ ను శాసించే స్థానంలో ఉన్నట్టే లెక్క. బదులిచ్చేందుకు బరిలో దిగిన భారత్ 281 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా, ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ కు వచ్చాడు. అప్పటికే ధోనీ ఆడుతున్నాడు. ఈ జోడీ 210 పరుగులు జోడించడంతో భారత్ సురక్షిత స్థానంలో నిలిచింది. ఆ సమయంలో పాక్ పేసర్ షోయబ్ అక్తర్ 160 కిలోమీటర్ల ప్రచండవేగంతో బౌలింగ్ చేస్తున్నాడని, అతడ్ని కాచుకుంటే మ్యాచ్ లో సురక్షితమైన స్థితికి చేరవచ్చని గ్రహించామని పఠాన్ వివరించాడు.

"నేను క్రీజు వద్దకు రాగానే పిచ్ ఎలా ఉంది అని ధోనీని అడిగాను. ఇబ్బందేమీ లేదు, బ్యాటింగ్ చేయొచ్చని అతడు బదులిచ్చాడు. నేను బ్యాటింగ్ మొదలుపెట్టగానే అక్తర్ విసిరిన ఓ బంతి చెవి పక్కనుంచి దూసుకెళ్లింది. ఆ బంతిని నేను చూడలేకపోయాను. తర్వాత స్పెల్ లోనూ అక్తర్ అదే తీవ్రతతో బౌలింగ్ చేయసాగాడు. ఈసారి బంతి రివర్స్ స్వింగ్ అవుతుండడం గమనించాం. ఇలాగైతే కష్టమని భావించాం. అందుకే ఓ ఎత్తుగడ వేశాను. ధోనీ భాయ్, నేను అక్తర్ ను మాటలతో కవ్విస్తాను, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు నవ్వాలి అని సూచించాను. అందుకు ధోనీ సరేనన్నాడు.

అక్తర్ మళ్లీ బౌలింగ్ కు వచ్చాడు. పదునైన బంతులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో, ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకుని, "నువ్వు ఇదే కసితో తర్వాతి స్పెల్ కూడా వేయగలవా?" అని కవ్వించాను. దాంతో అక్తర్ కోపంతో, "నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిన్ను ఇక్కడ్నించి పంపించేయగలను" అంటూ బదులిచ్చాడు. దాంతో, "నీకంత లేదు, నేను కూడా నిజమైన పఠాన్ నే. ఇక మాట్లాడకుండా వెళ్లి బౌలింగ్ చేసుకో" అంటూ మాటకు మాట వడ్డించాను.

దాంతో రెచ్చిపోయిన అక్తర్ వరుసగా షార్ట్ బాల్స్ వేయడం మొదలుపెట్టాడు. బౌన్సర్ తర్వాత బౌన్సర్ వేస్తూ మమ్మల్ని భయకంపితుల్ని చేయాలనుకున్నాడు. కానీ అక్తర్ కోపంతో ఇలాంటి బంతులే వేస్తాడని ముందే ఊహించాం కాబట్టి వాటిని ఆడడం మాకు ఎంతో సులభమైంది. అతడి స్పెల్ ను ఆ విధంగా కాచుకుని, ఇతర బౌలర్లను మరింత ఈజీగా ఆడేశాం. చివరికి మ్యాచ్ ను డ్రా చేసుకున్నాం" అని పఠాన్ నాటి సంఘటనలను వివరించాడు. ఆ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 603 పరుగులు చేసింది. ధోనీ 148, ఇర్ఫాన్ పఠాన్ 90 పరుగులు చేశారు. టాపార్డర్ లో ద్రావిడ్ 103 పరుగులు సాధించాడు.

More Telugu News