Sarkaru Vari Pata: టాలీవుడ్ లో 'సర్కారు వారి పాట' సరికొత్త రికార్డు

Mahesh Babu new movie Sarkaru Vari Pata sets Tollywood record
  • ఆదివారం రిలీజైన మహేశ్ కొత్త చిత్రం పోస్టర్
  • 24 గంటల్లో 33 వేల రీట్వీట్లు
  • మరే టాలీవుడ్ చిత్రానికి దక్కని ఘనత
నిన్న మహేశ్ బాబు ఫ్యాన్స్ కు పండుగ అని చెప్పాలి. ఓవైపు సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం, మరోవైపు మహేశ్ బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' టైటిల్ పోస్టర్ రిలీజ్! ఇంకేముంది, సోషల్ మీడియాలో ఎంబీ ఫ్యాన్స్ కోలాహలం మిన్నంటింది.

ఇక అసలు విషయానికొస్తే.... ఆదివారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజైన 'సర్కారు వారి పాట' టైటిల్ పోస్టర్ టాలీవుడ్ రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక రీట్వీట్లు పొందిన పోస్టర్ గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది. ఎంతో డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ కు దాదాపు 33 వేల రీట్వీట్లు వచ్చాయి. తెలుగు చిత్రసీమలో మరే చిత్రం ప్రీలుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో ఈ స్థాయి స్పందన రాలేదు. ఇక, లైకుల విషయంలోనూ మహేశ్ బాబు కొత్త చిత్రం పోస్టర్ మోత మోగిస్తోంది. ఇప్పటివరకు 85 వేలకు పైగా లైకులు వచ్చాయి.

'సర్కారు వారి పాట' అనే టైటిల్ చాలా ఫ్రెష్ గా ఉండడం, కొంచెమే కనిపించినా మహేశ్ బాబు రఫ్ లుక్ ఆకట్టుకునేలా ఉండడం ఈ పోస్టర్ కు విపరీతమైన ఆదరణ వచ్చేలా చేశాయి. మెడపై రూపాయి బిళ్ల టాటూ, చెవికి రింగు... మహేశ్ అప్పియరెన్స్ పై ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పరశురామ్ కు వస్తున్న అభినందనలకైతే లెక్కేలేదు. టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు పరశురామ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట చిత్రాన్ని మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి.
Sarkaru Vari Pata
Mahesh Babu
Record
Tollywood
Poster
Pre Look

More Telugu News