Chandrababu: ఏడాది పాలనకే ఇంత గూండాయిజాన్ని ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు

  • వైసీపీ ఏడాది పాలనపై చంద్రబాబు విమర్శలు
  • వ్యవస్థలనే నాశనం చేసే స్థితికి తెచ్చారంటూ ఆగ్రహం
  • ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలంటూ హితవు
Chandrababu criticizes YSRCP ruling

ఏపీలో వైసీపీ పాలనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'విధ్వంసానికి ఒక్క చాన్స్' పేరిట సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. గౌరవప్రదమైన పదవిలోకి వచ్చాకైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, వారి గత చరిత్ర ప్రభావం పాలనపై పడకుండా చూసుకుంటారని అందరూ భావించినా, వైసీపీ నేతలు తమ పద్ధతి మార్చుకోకుండా కక్షలు సాధించడానికి, అక్రమార్జన కోసం వ్యవస్థలనే నాశనం చేసే స్థితికి తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు.

మీడియాపై ఉక్కుపాదం, రాజధానిని మూడు ముక్కలు చేయడం, శాసనమండలి రద్దు చేయడం, ఎస్ఈసీ తొలగింపు నిర్ణయాలన్నీ గూండా మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏడాది పాలనకే ఇంత గూండాయిజాన్ని ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులను నామినేషన్ కూడా వేయనివ్వకుండా దౌర్జన్యాలు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థనే కూల్చేయాలనుకున్నారని ఆరోపించారు.

దాదాపు 65 కేసుల్లో న్యాయస్థానాలు వీళ్ల చర్యలను కట్టడి చేయకపోయి ఉంటే రాష్ట్రం ఏమైపోయి ఉండేదా అని భయం వేస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉపయోగిస్తున్న భాష చూస్తుంటే వీధి రౌడీలు వీళ్ల కన్నా నయం అనిపించే పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజలు ఎంతో గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టారని, ఆ మర్యాదను కాపాడుకోవాలని హితవు పలికారు.


More Telugu News