తెలంగాణకు భారీవర్ష సూచన... మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో వానలు!

31-05-2020 Sun 16:02
  • లక్షదీవుల నుంచి చత్తీస్ గఢ్ వరకు ఉపరితల ద్రోణి
  • అరేబియా సముద్రంలో అల్పపీడనం
  • త్వరలో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు
Weather report for Telangana
ఎండలతో మండిపోతున్న హైదరాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా తదితర ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడింది. ఇదే విధంగా తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రస్తుతం లక్షదీవుల నుంచి కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ మీదుగా చత్తీస్ గఢ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికల్లా వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. ఇక నైరుతి రుతుపవనాలు కూడా మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటాయని తెలిపింది.