AP Secretariat: హైదరాబాద్ నుంచి వచ్చిన ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో ముగ్గురికి కరోనా!

  • హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్న 227 మంది ఉద్యోగులు
  • కరోనా భయంతో వణుకుతున్న సచివాలయ ఉద్యోగులు
  • సీఎం క్యాంపు ఆఫీసులోని ఓ కానిస్టేబుల్‌కూ కరోనా
Three AP Secretariat Employees Infected to Coronavirus

హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో ముగ్గురికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగింది. లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 227 మంది ఉద్యోగులు బుధవారం ప్రత్యేక బస్సుల్లో అమరావతి చేరుకున్నారు. అనంతరం వీరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా, గురువారం నుంచి వీరంతా విధులకు హాజరవుతున్నారు. కాగా, వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ముగ్గురిలో ఒకరు సచివాలయంలోని ఓ శాఖలో పనిచేస్తుండగా, మిగతా ఇద్దరు గుంటూరులోని ఓ శాఖ ప్రధాన కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు.

ముగ్గురు ఉద్యోగులు కరోనా బారినపడడంతో సచివాలయ ఉద్యోగుల్లో  భయం మొదలైంది. దీంతో స్పందించిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.. రేపటి నుంచి వారం రోజులపాటు ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రం హోం’ సౌకర్యం కల్పించాలని ఉన్నతాధికారులను కోరారు. అలాగే, నెగటివ్‌గా తేలిన వారిని మాత్రం విధుల్లోకి అనుమతించాలన్నారు.

మరోవైపు, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పనిచేసే కర్నూలుకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కూడా కరోనా బారినపడ్డాడు. నాలుగు రోజుల క్రితమే అతడు విధుల్లో చేరగా వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహించారు. నిన్న పరీక్ష ఫలితాలు రాగా కరోనా సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించి మిగతా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

More Telugu News