ఊరికనే అన్న మాటకు నాలుగు రోజుల హడావుడి: బాలయ్య వ్యాఖ్యల రగడపై రామ్ గోపాల్ వర్మ

31-05-2020 Sun 06:23
  • ఇటీవ తెలంగాణ సర్కారుతో సినీ పెద్దల చర్చలు
  • తనను పిలవలేదన్న నందమూరి బాలకృష్ణ
  • తనకు కావాల్సిన విషయాన్నే మీడియా తీసుకుందన్న వర్మ
Ramgopal Varma comments on Balakrishna

ఇటీవల తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి, లాక్ డౌన్ నష్టాలు, షూటింగ్స్, థియేటర్ల పునః ప్రారంభంపై చర్చించగా, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం గురించి తనకు తెలియజేయలేదని, మీడియాలో చూసే తాను తెలుసుకున్నానని, తలసానితో కలిసి వారంతా భూములను పంచుకుంటున్నారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఆపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హీట్ ను పెంచాయి. నాగబాబు గట్టి కౌంటర్ ను ఇవ్వగా, నిర్మాత సీ కల్యాణ్ తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్పందించారు. తాజాగా, ఈ మొత్తం ఘటనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా లైట్ గా తీసుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, బాలకృష్ణ ఏదో ఊరికనే ఆ మాట అనుంటారని, దానిపై మీడియా నాలుగైదు రోజుల హడావుడిని చేస్తుందని అన్నారు. ఆయన కొన్ని మాటలు అనుండవచ్చని, కానీ మీడియా తమకు కావాల్సిన విషయాన్నే పదేపదే చెబుతోందని అన్నారు. ఇదే సమయంలో తన కొత్త చిత్రం 'కరోనా వైరస్' గురించిన విషయాలనూ ఆయన అభిమానులతో పంచుకున్నారు.